Kota: “మమ్మీ, డాడీ, ఈ జేఈఈ నావల్ల కాదు”.. కోటాలో మరో ఆత్మహత్య..

www.mannamweb.com


Kota: రాజస్థాన్ కోటాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు.
కోటాలో 18 ఏళ్ల జేఈఈ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులను ఉద్దేశించి సూసైడ్ నోట్ రాసింది. పరీక్షకు రెండు రోజుల ముందు ఆమె ఆత్మహత్య చేసుకుంది. కోటాలో వారం రోజుల్లో ఇది రెండో ఆత్మహత్య.
చనిపోయిన విద్యార్థినిని 18 ఏళ్ల నిహారికగా గుర్తించారు. కోటలోని శిక్షానగరి ప్రాంతంలో తన ఇంటి గడిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె పరీక్ష జనవరి 31న జరగాల్సి ఉంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ”తాను ఒక వరస్ట్ కూతురిని, ఇదే తనకు లాస్ట్ ఆప్షన్” అని రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ”అమ్మా, నాన్న, ఈ జేఈఈ నావల్ల కాదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేనే కారణం. నేను మంచి కూతుగా ఉండలేకపోయాను. క్షమించండి అమ్మా నాన్న. ఇదే చివరి ఆప్షన్” అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

అంతకుముందు జనవరి 23న కోటాలో ప్రైవేట్ కోచింగ్ ద్వారా నీట్‌కు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొరాదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్ తన గదిలో ఉరివేసుకుని కనిపించాడు. సూసైడ్ నోట్ దొరకలేదు. ఇంజినీరింగ్ మరియు మెడికల్ ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు పేరుగాంచిన కోటాలో 2023లో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.