ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, శోభన్‌బాబులను దాటుకొని వచ్చిన సినిమాతో చరిత్ర సృష్టించిన కృష్ణ!

www.mannamweb.com


కొన్ని సినిమాలను చూస్తే అందులోని ప్రధానమైన క్యారెక్టర్‌ ఆ హీరో కోసమే పుట్టిందా? అనిపిస్తుంది అతన్ని తప్ప ఆ క్యారెక్టర్‌లో మరొకరిని ఊహించుకోలేం అన్నంతగా ముద్రపడిపోతుంది. అలాంటి సినిమాలు చేసే అవకాశం రావడం చాలా అరుదు. అయితే వచ్చిన ఆ అవకాశాన్ని ఆయా హీరోలు సద్వినియోగం చేసుకున్నప్పుడే చరిత్ర సృష్టించే సినిమాలు తయారవుతాయి. అలాంటి అరుదైన, అపురూపమైన అవకాశం అల్లూరి సీతారామరాజు రూపంలో సూపర్‌స్టార్‌ కృష్ణకు వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆయన చూపించిన తెగువ సాధారణమైంది కాదు. 1 మే, 1974లో ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలైంది. ఇది సూపర్‌స్టార్‌ కృష్ణ 100వ సినిమా. 1962లోనే నటుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణ మూడు సినిమాల్లో చాలా చిన్న క్యారెక్టర్స్‌ చేశారు. 1965లో ‘తేనెమనసులు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కేవలం 9 సంవత్సరాల్లో 100 సినిమాలు పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు కృష్ణ.

అల్లూరి సీతారామరాజు సినిమాకి ఎక్కడ బీజం పడిరదంటే.. 1968లో అసాధ్యుడు చిత్రంలోని ఒక నాటకంలో అల్లూరి సీతారామరాజు గెటప్‌ వేశారు కృష్ణ. అప్పుడే డిసైడ్‌ అయ్యారు ఎప్పటికైనా అల్లూరి సీతారామరాజు సినిమా చెయ్యాలని. అంతకుముందు 1958లో వచ్చిన ఆలుమగలు చిత్రంలో జగ్గయ్య కూడా అల్లూరిగా నటించారు. దాన్ని కూడా స్ఫూర్తిగానే తీసుకున్నారు కృష్ణ. ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు.. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను అక్కినేని నాగేశ్వరరావుతో తియ్యాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు.

ఎన్‌.టి.రామారావుకి కూడా ఈ సినిమా చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్టు తయారు చేయించారు. ఇది కూడా ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత శోభన్‌బాబు వంతు వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావుతో ‘దేవదాసు’ చిత్రాన్ని నిర్మించిన డి.ఎల్‌.నారాయణ.. అల్లూరి సినిమాను తియ్యాలనుకున్నారు. దాని కోసం కొంత ప్రయత్నం కూడా చేశారు. కానీ, అది జరగలేదు. కొన్ని క్యారెక్టర్స్‌ కొంతమంది కోసమే రాసి ఉంటాయి అని చెప్పడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. చివరికి కృష్ణ వంతు వచ్చింది.

హీరోగా నిలదొక్కుకొని దాదాపు 100 సినిమాల వరకు చేసిన తర్వాత అప్పటివరకు కృష్ణ మనసులో ఉన్న అల్లూరి సీతారామరాజు పాత్ర మరోసారి తెరరూపం దాల్చుకునే న్రయత్నం చేసింది. త్రిపురనేని మహారథితో స్క్రిప్టు రాయించడానికి సిద్ధమయ్యారు కృష్ణ. అప్పటికి మహారథి బాగా బిజీ రచయిత. ఒక అద్భుతమైన సినిమాకు స్క్రిప్టు తయారుచేసే బాధ్యతను తనకు అప్పగించినందుకు ఆయన అంతకుముందు ఒప్పుకున్న సినిమాలన్నింటినీ క్యాన్సిల్‌ చేసుకున్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు గురించి ఎన్నో పరిశోధనలు చేసి పక్కాగా స్క్రిప్ట్‌ రెడీ చేశారు. వి.రామచంద్రరావు దర్శకత్వంలో ‘అల్లూరి సీతారామరాజు’ ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా హార్సిలీ హిల్స్‌లో ఎక్కువ భాగం చిత్రీకరించారు. సినిమా కొంతభాగం షూటింగ్‌ అయిన తర్వాత దర్శకుడు వి.రామచంద్రరావు అనారోగ్యంతో కన్నుమూశారు. దాంతో షూటింగ్‌ కొన్నిరోజులు ఆగింది. మిగిలిన సినిమాకు కృష్ణనే దర్శకత్వం వహించమని సన్నిహితులు సలహా ఇవ్వడంతో మళ్ళీ షూటింగ్‌ ప్రారంభించారు కృష్ణ. కొన్ని పోరాట దృశ్యాలను కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ చిత్రీకరించారు. 1 మే, 1974లో విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం చరిత్ర సృష్టించింది. ఆ పాత్ర చేసిన కృష్ణను ప్రేక్షకులే కాదు, సినీ ప్రముఖులు కూడా అభినందించారు.