Krishna-Vijaya Nirmala : రాజబాబు అన్న సరదా మాట.. కృష్ణ రెండో పెళ్లికి బీజం అయ్యింది..

www.mannamweb.com


సూపర్ స్టార్ కృష్ణ(Krishna).. విజయనిర్మలను(Vijaya Nirmala) రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ఈ జంట డేరింగ్ అండ్ డాషింగ్ కపుల్ గా పిలిపించుకున్నారు.
ఈ జోడికి మరో పేరు కూడా ఉండేది. వీరిద్దర్నీ ‘ఆంధ్రా ప్రేమ్‌ నజీర్‌-షీలా’గా పిలిచేవారు. కాగా కృష్ణ, విజయనిర్మల ప్రేమ వెనుక.. ఒకప్పటి స్టార్ కమెడియన్ రాజబాబు(Rajababu) అన్న ఓ సరదా మాట ఉందట. ఆ మాటతోనే కృష్ణ-విజయనిర్మల పెళ్ళికి బీజం పడింది. ఇంతకీ ఆ మాట ఏంటి..?

ఈ విషయాన్ని స్వయంగా కృష్ణనే ఓ సందర్భంలో తెలియజేశారు. కృష్ణ, విజయనిర్మల కలిసి మొదటిసారి ‘సాక్షి’ అనే సినిమాలో నటించారు. 1967లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాపు తెరకెక్కించారు. ఈ సినిమాలో రాజబాబు ఓ ముఖ్య పాత్ర చేశారు. కాగా ఈ మూవీ షూటింగ్ అంతా రాజమండ్రి దగ్గరలోని పులిదిండిలో జరిగిందట. ఇక ఈ సినిమాలోని ‘అమ్మ కడుపు చల్లగా’ అనే సూపర్ హిట్ సాంగ్ షూటింగ్ ఆ ఊర్లో ఉన్న ‘మీసాల కృష్ణుడు’ గుడిలో జరిగిందట.
పెళ్లి వేడుక నేపథ్యంతో ఈ సాంగ్ చిత్రీకరణ ఉంటుంది. ఇక సినిమా షూటింగ్ అయినా.. ప్రతి విషయాన్ని శాస్త్రోక్తంగా చేసే బాపు.. ఆ పెళ్లి తతంగం మొత్తాన్నీ నిజమైన పెళ్లిలా జరిపించారు. ఈక్రమంలోనే కృష్ణ-విజయనిర్మలకు శాస్త్రోక్తంగా ఆ గుడిలో అబద్ధపు పెళ్లి జరిగింది. ఇక ఆ పాటని తెరకెక్కిస్తున్న సమయంలో కృష్ణతో రాజబాబు ఇలా అన్నారట.. “ఈ గుడి చాలా మహిమగలది అంట. ఇప్పుడు అబద్ధపు పెళ్లి చేసుకున్న మీరు. త్వరలోనే నిజం పెళ్లి చేసుకుంటారు” అంటూ సరదాగా మాట్లాడారట.

ఆ మాటలకు సెట్స్ లోని ప్రతి ఒక్కరు నవ్వుకున్నారట. కానీ ఆ తరువాత రెండేళ్లకే 1969 మార్చి 24న కృష్ణ-విజయనిర్మల తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. ఒక సందర్భంలో కృష్ణ తమ పెళ్లి గురించి మాట్లాడుతూ.. రాజబాబు మాటల్ని గుర్తు చేసుకున్నారు. “నేను సెంటిమెంట్స్ ని నమ్మను. కానీ రాజబాబు అన్న మాటలు నిజంగా జరిగినప్పుడు ఆశ్చర్యపోయాను” అంటూ కృష్ణ చెప్పుకొచ్చారు.