గురువారం వెలుగు చూసిన కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ,లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ డెత్ కేసులో మిస్టరీ వీడటం లేదు.
వాట్సాప్ చాటింగ్ డేటాను సేకరించిన పోలీసులు
మృతుల కాల్ డేటాతో పాటు వాళ్ల వాట్సాప్ చాటింగ్ సేకరించారు. ఇప్పుడు ఈకేసులో ఇదే అత్యంత కీలకంగా మారినట్లుగా తెలుస్తోంది. చనిపోయే ముందు ముగ్గురూ ఒకే కారులో అడ్లూరు దగ్గరున్న ఎల్లారెడ్డి చెరువు దగ్గరకు వెళ్లినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది.
వివాహేతర సంబంధమే కారణమా?
వివాహేతర సంబంధం ఇద్దరు వ్యక్తులతో పాటు మరొకరి ప్రాణాల్ని బలిగొంది. కామారెడ్డి జిల్లాలో ఇటీవల బిక్నూర్ ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తులు బలవన్మరణం చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కానిస్టేబుల్ శృతి, ఎస్ఐ సాయికుమార్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగినట్లుగా తెలుస్తోంది. వీళ్లిద్దరికి మధ్యవర్తిగా ఉన్న నిఖిల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది ఇప్పుడు ఈకేసులో కీలకంగా మారింది. అయితే మృతుల కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ సేకరించిన పోలీసులు ఆదిశగా కూపీ లాగుతున్నారు. గత వారం రోజులుగా వీళ్లు ముగ్గురూ రెగ్యులర్ గా కాల్స్ చేసుకోవడంతో పాటు ఎక్కువ సేపు చాటింగ్ చేసుకున్నట్లుగా తేలింది. అయితే వాళ్ల మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది అనే దాని ఆధారంగా కేసు విచారణ జరపనున్నారు. త్వరలో అన్ని వివరాలు తెలుపుతామని, ప్రస్తుతం కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.