Lakshmi Jayanthi 2025: లక్ష్మిదేవి జయంతి.. ఈ చిన్న మంత్రంతో ఏడాది మొత్తం లాభాలే లాభాలు!
సర్వ సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. ఆమె అనుగ్రహం ఉంటేనే మన దగ్గర డబ్బు నిలుస్తుంది. లక్ష్మీ లేకపోతే ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎంత పేరు ఉన్నా సరే వ్యర్థం అని చెప్పాలి.
ఇకపోతే లక్ష్మీ అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అయితే మామూలుగా శుక్రవారం రోజు అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అయితే రేపు అనగా మార్చి 14న వచ్చే శుక్రవారం చాలా స్పెషల్ అని చెబుతున్నారు. ఎందుకంటే రేపు లక్ష్మీదేవి జన్మదినం. ఈ రోజున అమ్మవారిని పూజిస్తూ కొన్ని విధి విధానాలు పాటిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట. అయితే అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..
లక్ష్మీదేవి ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి నక్షత్రంలో జన్మించింది. అందుకే ఈ రోజును లక్ష్మీ జయంతి అని పిలుస్తారు. ఇదే రోజున హోలీ పండుగ కూడా జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చి 14వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజును శ్రీలక్ష్మీ జయంతిగా జరుపుకోవాలని చెబుతున్నారు. లక్ష్మీ జయంతి రోజు ముందుగా ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత స్నానం ఆచరించి పూజా మందిరంలో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తుంటే వరద, అభయ హస్తాలతో తామర పువ్వులో కూర్చున్న అమ్మవారి చిత్ర పటాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. తర్వాత లక్ష్మీదేవి చిత్ర పటాన్ని గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలట. అనంతరం చిత్రపటం ఎదురుగా ప్రమిదలో తామర లేదా జిల్లేడు వత్తులతో దీపం వెలిగించాలట.
అవి లేకపోతే ఆరు మామూలు వత్తులు వేసి దీపారాధన చేయాలట. శ్రీ లక్ష్మీ జయంతి రోజు అష్టమూలిక తైలంతో దీపం పెడితే చాలా మంచిదని చెబుతున్నారు. అది అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యి, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలట..అయితే లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలని అవుతున్నారు. ఆ మంత్రం లక్ష్మీ కమలవాసినయే స్వాహః దీన్నే విమల మంత్రం అని కూడా పిలుస్తారు. గులాబీ పూలు, పద్మ పుష్పాలతో సిరుల తల్లిని పూజిస్తే చాలా మంచిదని చెబుతున్నారు. ఒకవేళ రకరకాల పూలు అందుబాటులో లేకపోతే అక్షింతల్లో కుంకుమ కలిపి వాటితో పైన చెప్పిన మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని పూజించినా మంచి ఫలితం కలుగుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత అమ్మవారికి వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలని,ఆపై ఈ ప్రసాదాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వీకరించాలని చెబుతున్నారు. కాగా లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించాలట. ఆ తర్వాత ముత్తైదువులను ఇంటికి పిలిచి కొద్దిగా బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి వాయినం ఇవ్వాలని చెబుతున్నారు. ఇలా చేసినా ఏడాది మొత్తం లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందట. అదేవిధంగా మారేడు దళం మీద గంధం రాసి దాన్ని లక్ష్మీదేవి ఫొటో వద్ద ఉంచి నమస్కారం చేసుకోవాలట. చేసినా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చట.