నిషేధం నుంచి భూములకు విముక్తి, ఇక నుంచి – కీలక మార్పులు

పీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై ఉన్న నిషేధం తొలిగింపు దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోనుంది.


అతి త్వరలో రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెబుతామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. ఈ మేరకు మంత్రివర్గ ఉప సంఘం కీలక అంశాల పైన చర్చించింది. భూ కేటాయింపు విధానంలోనూ మార్పుల దిశగా సిఫార్సులు సిద్దమవుతన్నాయి. ఇక నుంచి లీజు ప్రాతిపదికనే కేటాయింపులు చేయాలని డిసైడ్ అయ్యారు.

భూ కేటాయింపులు.. వివాదాల పైన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం కీలక అంశాల పైన ఒక నిర్ణయానికి వచ్చింది. మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, పయ్యావుల కేశవ్‌, పి.నారాయణ, కె.పార్థ సారథి భేటీ అయి ఈ అంశాల పైన చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల చట్టం-1977లో చేసిన చట్టసవరణ, నిబంధనలకు లోబడి ఉన్న భూములకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే జిల్లా స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికల్లోని పలు అంశాలపై కూడా కీలక ప్రతిపాదనలు చేసింది. వాటన్నిటికీ ఉపసంఘం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఫ్రీహోల్డ్‌ కింద కొన్ని రకాల భూములను అనుమతించకూడదని ఆ శాఖ చేసిన ప్రతిపాదనలపై వచ్చే సమావేశంలో చర్చించి అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రులు నిర్ణయించినట్లు సమాచారం.

అదే విధంగా అసైన్డ్‌ భూమి కేటాయించి 20 ఏళ్లు పూర్తయి, లబ్ధిదారుల చేతుల్లోనే భూమి ఉంటే వాటిని నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించాలని, ఆ తర్వాత రైతులకు ఆ భూములపై శాశ్వత హక్కులు కల్పించాలని వైసీపీ ప్రభుత్వం 2023లో అసైన్డ్‌ చట్టాన్ని సవరించింది. ఈ విధానం అమలుకు 2023 డిసెంబరులో జీవో 596 తీసుకొచ్చింది. అయితే నాటి ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతలు కుమ్మక్కై.. 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే విచారణ చేయించింది. జగన్‌ సర్కారు 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా, చట్టవిరుద్ధంగా నిషేధ బాబితా నుంచి తీసేసినట్లు తేలింది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని గత ఏడాది ఆగస్టులోనే ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌పై నిషేధం విధించింది.

వీలైనంత త్వరగా ఫ్రీహోల్డ్‌ భూములపై నివేదిక ఇవ్వాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో జీవో 596 మార్గదర్శకాల ప్రకారం అర్హత సాధించిన 7.85 లక్షల ఎకరాల భూమిని ఫ్రీహోల్డ్‌కు అనుమతి రెవెన్యూ శాఖ తాజాగా ప్రతిపాదించింది. భూమి లబ్ధిదారు చేతిలోనే ఉండి సాగు చేసుకుంటుంటే.. అలాంటి వాస్తవికమైన కేసుల్లో ఫ్రీహోల్డ్‌ జరిగేలా చూడాలని సూచించింది. ఇందుకు మంత్రులు సానుకూలంగా స్పందించారు. నిబంధనలకు విరుద్దంగా నిషేధ జాబితా నుంచి తొలగించిన 5.74 లక్షల ఎకరాల భూములను తిరిగి 22ఏలో చేర్చాలన్న ప్రతిపాదనను కూడా సబ్‌కమిటీ ఆమోదించింది. అలాగే పరిశ్రమలు, కంపెనీలు, సంస్థలు మొదలైనవాటికి ఇకపై లీజు ప్రాతిపదికనే కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.