వరల్డ్‌లో ఇదే అతి పెద్ద రాష్ట్రం.. విస్తీర్ణంలో ఇండియాతో సమానం

విస్తీర్ణపరంగా ప్రపంచంలో భారత్‌ ఏడో పెద్ద దేశం. ఇండియా వైశాల్యం 32.87 లక్షల చదరపు కిలోమీటర్లు. మన దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు ఐరోపాలో ఉన్న అనేక దేశాల కంటే పెద్దగా ఉంటాయి.
ఇక్కడి వరకు మనం ఎక్కడో ఒకచోట చదివో లేదంటే వినో ఉంటాం. కానీ, ఈ భూగోళంపై ఏరియా పరంగా, భారత్‌తో సమానమైన రాష్ట్రం ఒకటి ఉందంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఒక దేశంలో భాగంగా ఉన్న రాష్ట్ర వైశాల్యం, దాదాపు మన భారతదేశ వైశాల్యంతో సమానంగా ఉంది. అదెక్కడ ఉంది? దాని విశేషాలేంటో చూద్దాం.


రష్యాలోనే ఆ స్టేట్ ఉంది..
విస్తారమైన రష్యా ఈశాన్య ప్రాంతంలో యాకుటియా (Yakutia) అనే ప్రావిన్స్‌ ఉంది. దీన్ని అధికారికంగా సఖా రిపబ్లిక్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాష్ట్రం. దీని విస్తీర్ణం 31 లక్షల చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం పరంగా చూస్తే, ఇది ప్రపంచంలోని అతిపెద్ద దేశాలతో పోటీ పడుతోంది. ఈ మారుమూల ప్రాంతం సహజమైన అద్భుతాలకు నెలవు. ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వం, ఆసక్తికరమైన భౌగోళిక లక్షణాలను కలిగి ఉంది.

* భౌగోళిక పరిస్థితులు
యాకుటియాలో (Yakutia) విభిన్నమైన భూభాగాలు ఉన్నాయి. విశాలమైన టైగా అడవులు, ఎత్తైన పర్వత శ్రేణులు, విస్తారమైన టండ్రాలకు ఇది నెలవుగా ఉంది. ప్రపంచంలోని అతి పొడవైన నదుల్లో ఒకటైన లీనా కూడా ఇక్కడే ఉండటం విశేషం. ఈ ప్రాంతం అత్యధికంగా ఆర్కిటిక్ సర్కిల్‌లో ఉంది. దీంతో ఇక్కడ ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ, వాతావరణ పరిస్థితులను ఉంటాయి. అత్యధిక భాగం అడవులతో నిండి ఉన్న ప్రాంతంలోని చాలా ప్రదేశాల్లోకి ఇప్పటి వరకు మనుషులు ప్రవేశించలేదు. అక్కడి అడవులు అరుదైన వృక్షజాలం, జంతుజాలానికి స్వర్గధామం.

* జనాభా
యాకుటియా జనాభా కేవలం పది లక్షలు. అంటే ఒక్క చదరపు కిలోమీటర్‌ విస్తీర్ణంలో ఒక్కరే నివసిస్తున్నారు. ఎక్కువ మంది రాజధాని నగరం యాకుట్స్క్‌లో లేదా దాని చుట్టుపక్క ఉన్న చిన్న పట్టణాలు, గ్రామీణ స్థావరాలలో నివసిస్తున్నారు. భూమిపై అత్యంత శీతల నగరాల్లో యాకుట్స్క్ ఒకటి. అయినప్పటికీ, యాకుటియా (Yakutia) సంస్కృతికి ఇది శక్తిమంతమైన కేంద్రంగా ఉంది. యాకుటియాలో వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఏడాదిలో ఎక్కువ సమయం శీతాకాలమే ఉంటుంది. చలి చాలా తీవ్రంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు -72 డిగ్రీల సెల్సియస్‌ వరకు పడిపోతాయి. వేసవి కొంత కాలమే ఉన్నప్పటికీ.. ఆశ్చర్యకరంగా ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌ దాటుతుంటాయి.

* సహజ వనరులు
యాకుటియాలో (Yakutia) సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. రష్యా కీలక ఆర్థిక వనరుల్లో, ప్రపంచంలో వజ్రాలు లభించే అతిపెద్ద ప్రాంతాల్లో ఇదొకటి. వజ్రాలతో పాటు బంగారం, బొగ్గు ఇతర ఖనిజాలు సైతం లభిస్తాయి. ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఇవే ఆధారం. అయితే కఠినమైన వాతావరణం వల్ల ఖనిజాల వెలికితీత తరచూ సవాళ్లను విసురుతుంటుంది.

* జీవ వైవిధ్యం
ఇక్కడి అడవుల్లో రెయిన్ డీర్, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, లింక్స్ వంటి వివిధ రకాల వన్యప్రాణులు ఉంటాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన లీనా స్తంభాల వంటి అనేక సహజ అద్భుతాలు కూడా ఇక్కడే ఉన్నాయి. లీనా నది వెంట ఉన్న ఈ ఎత్తైన శిలా నిర్మాణాలు పర్యాటకులు, పరిశోధకులకు ఆసక్తి కలిగిస్తాయి.

* సాంస్కృతిక వారసత్వం
యాకుటియా స్థానిక ప్రజలకు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. వారి సంప్రదాయాలలో ప్రత్యేకమైన సంగీతం, నృత్యం, కథ చెప్పడం వంటి అంశాలు ఉండడం విశేషం. షమానిజం, పురాతన ఆచారాలు వారి సాంస్కృతిక గుర్తింపులో అంతర్భాగం. వీటిపై ఆధునికత ప్రభావం కూడా ఉండడం గమనార్హం. వేసవి కాలంలో జరుపుకొనే వైస్యఖ్ పండుగ యాకుటియా (Yakutia) అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలలో ఒకటి. ఈ పండుగలో భాగంగా ప్రకృతిని గౌరవించేలా సంప్రదాయ సంగీతం, నృత్యాలు ఉంటాయి.