ఏపీ ప్రభుత్వం ముందు ఉద్యోగుల తాజా డిమాండ్లు…పీఆర్సీ, బకాయిల సహా.

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం ఇవాళ విజయవాడలో జరిగింది. గాంధీనగర్ లోని ఎన్జిజీవో హోమ్ లో జరిగిన ఈ భేటీలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళవలసిన ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ఏపి ఎన్జీజివో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.విద్య సాగర్ ను రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఎన్నుకున్నారు.


ఈ భేటీలో ఏపీ జేఏసీ నేతలు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో 12వ పీఆర్సీ కమిషనర్ ను వెంటనే నియమించాలని కోరారు. అలాగే పీఆర్సీ అమలు అయ్యేలోపు 29శాతం ఐఆర్ ప్రకటించాలని తీర్మానించారు. జిపిఎఫ్, ఏపీజిఎల్ఐ, సరెండర్ లీవులు తదితర బకాయిలను చెల్లించాలని, పేరుకుపోయిన పెండింగ్ బకాయిల చెల్లింపునకై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అలాగే పెండింగ్లో ఉన్న డి.ఏలను మంజూరు చేయాలని ఉద్యోగ నేతలు తీర్మానించారు. కేంద్ర పభుత్వ మెమో 57 ప్రకారం సెప్టెంబర్ 2004 ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన ఉద్యోగ ఉపాధ్యాయలకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలుపరచాలన్నారు. కూటమి ప్రభుత్వ హమికి అనుగుణంగా CPS రద్దుకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరారు. రిటైర్ అయ్యే ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యుటి, కమ్యూటేషన్ తదితర పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలన్నారు.

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చెయ్యాలని, గురుకుల ఉద్యోగులకు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు, మోడల్ స్కూల్, ఎంటీఎస్ కు పదవి విరమణ వయస్సు 62కు పెంచాలని కోరుతూ తీర్మానించారు. 2014కి ముందు నియమించబడి రెగ్యులరైజ్ కానీ 7000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యాలని కోరారు. పంచాయతి రాజ్ డిపార్టుమెంటు, తదితర శాఖలలో పెండింగ్ లో ఉండిపోయిన కారుణ్య నియామకాలకు పరిష్కరం చూపాలన్నారు. 11వ పీఆర్సీలో పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ను పునరుద్దరించాలన్నారు.

అలాగే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ డిపార్టుమెంటులో గత ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను ఆర్టీసీ నిబంధల ప్రకారం అమలు చేయాలన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కోస్ ద్వారా సేవలు కొనసాగించాలన్నారు. మెడికల్ డిపార్టుమెంటులో తొలగించబడిన ఎంపీహెచ్ఏలను తిరిగి సర్వీస్ లోకి తీసుకోవాలని కూడా తీర్మానించారు.