హెచ్‌-1బీ వీసాల ఫీజులకు వ్యతిరేకంగా యూఎస్‌ కోర్టులో దావా

హెచ్‌-1బీ వీసా(H-1B Visa Fee)ల విషయంలో అమెరికా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల వాటి ఫీజును 215 డాలర్ల నుంచి   లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. హెచ్‌-1బీ వీసాల ఫీజు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ.. వివిధ ఉద్యోగ సంఘాలు యూఎస్‌ కోర్టులో దావా(Lawsuit) వేశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్‌ కోర్టులో ట్రంప్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. వివిధ ఉద్యోగ సంఘాల యూనియన్లు తొలి దావా వేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.


హెచ్‌-1బీ వీసా ఫీజుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకుంటున్న చర్యలు చట్టవిరుద్ధమైనవని ఉద్యోగ సంఘాల యూనియన్లు దావా (Lawsuit challenging H 1B visa fee hike)లో పేర్కొన్నాయి. దేశానికి సంపద సృష్టించాలనే ఆలోచనతో ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ఫీజులు, పన్నులు విధించే అధికారం ట్రంప్‌నకు లేవని వెల్లడించాయి. ఈ ప్రకటన ద్వారా అధ్యక్షుడు అన్ని పరిమితులను విస్మరించారని పేర్కొన్నాయి. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశాయి.

ట్రంప్ ప్రకటించిన వీసా ఫీజు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. హెచ్‌-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త హెచ్‌1బీ వీసా విధానం భారత్‌తో పాటు, చైనాపైనా తీవ్ర ప్రభావం చూపనుంది.

అయితే హెచ్‌-1బీ వీసా (H-1B Visa)పై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని, దరఖాస్తు చేసుకొనే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్‌ ఫీజు మాత్రమేనని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ ఇటీవల స్పష్టత ఇచ్చారు. ఈ వన్‌టైమ్‌ లక్ష డాలర్ల రుసుము ఇకపై కొత్తగా హెచ్‌-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునేవారికే అమలుచేస్తామని, ప్రస్తుత వీసాదారులకు, రెన్యువల్‌కు వర్తించదని చెప్పారు. 2026 నుంచి ఈ ప్రక్రియ అంతా అమల్లోకి వస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్‌ లుట్నిక్ వెల్లడించారు. పాత వీసా విధానంలో లోపాలు ఉన్నాయని, అందువల్లే కొత్త నిబంధనలు రూపొందించామన్నారు. ఈనేపథ్యంలో ట్రంప్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగుల యూనియన్లు కోర్టులో దావా వేయడం గమనార్హం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.