Metro Rail: ఎల్బీనగర్ నుంచి హయత్‎నగర్ మెట్రో రైలు.. రూట్ మ్యాప్ వివరాలు ఇలా..

www.mannamweb.com


భాగ్యనగరంలో మెట్రోరైలు ఫేజ్ 2 పనులను ప్రారంభించేందుకు మెట్రో సంస్థ శ్రీకారం చుట్టింది. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో మార్గాన్ని విస్తరించాలని నిర్ణయించింది.

ఇప్పటి వరకూ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకూ మాత్రమే మెట్రో అందుబాటులో ఉంది.

అయితే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ సుమారు 7 కిలోమీటర్ల మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది. ఒక్కో కిలోమీటరుకు అటూ ఇటుగా ఒక్కో స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మీదుగా హైవే విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు.

ఇందులో భాగంగానే మెట్రో పిల్లర్ల నిర్మాణాలను జాగ్రత్తగా నిర్మించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీనిపై మెట్రో అధికారులు, జాతీయ రహదారుల సంస్థ ప్రతినిథులు భేటీ అయి చర్చించారు. మెట్రో రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. అందులో భాగంగానే తొలుత ఎల్బీనగర్ – హయత్ నగర్‎ను ఎంపిక చేశారు.

ఎల్బీనగర్ నుంచి చింతల్‎కుంట, వనస్థలిపురం, ఆటోనగర్, మహవీర్ నేషనల్ పార్క్, హయత్ నగర్ ఇలా అనేక ఏరియాల్లో స్టేషన్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. స్టేషన్ల పేర్లు, ఎక్కడెక్కడ స్టాపింగ్ ఉంటాయన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మార్గం మెట్రో అందుబాటులోకి వస్తే మియాపూర్ నుంచి హయత్ నగర్ వరకూ కేవలం గంటలో ప్రయాణం సుఖంగా, సాఫీగా చేసేందుకు వీలుంటుందని భావిస్తున్నారు నగరవాసులు.

అలాగే ట్రాఫిక్ కష్టాలకు కూడా చెక్ పెట్టవచ్చంటున్నారు. సాధారణంగా హయత్ నగర్ నుంచి మియాపూర్‎కు బస్సులో ప్రయాణించాలంటే రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అదికూడా రెండు బస్సులు మారుతూ ప్రయాణం చేయాలి. ఈ మెట్రో విస్తరిస్తే ఒకసారి హయత్ నగర్ లో ఎక్కితే గంటన్నర వ్యవధిలో మియాపూర్ కు చేరుకునే వెసులుబాటు ఉంటుంది.