జగన్ ను వదిలేయండి- పవన్ మరో సంచలనం

www.mannamweb.com


ఏపీలో తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చాక మాజీ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్న ఎన్డీయే కూటమి పార్టీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రేక్ వేశారు.

లడ్డూ వివాదం తర్వాత వైఎస్ జగన్ తిరుమల దర్శనం కోసం ఇవ్వాల్సిన డిక్లరేషన్ విషయంలో దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్న ఎన్డీయే కూటమి పార్టీల నాయకులకు అడ్డుకట్ట వేసేలా పవన్ కీలక సూచన చేశారు. దీంతో ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

రేపు తిరుమల దర్శనానికి వస్తున్న వైఎస్ డిక్లరేషన్ ఇవ్వకపోతే అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇది హిందువుల అంతర్గత వ్యవహారమని, వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడవద్దని ఆయన సూచించారు. జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకొనే ప్రక్రియ అన్నారు.

ఆ ప్రక్రియపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.

డిక్లరేషన్ ఇస్తారా లేదా, ఆలయ సంప్రదాయాలు, మర్యాదలు, నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్ళే వ్యక్తి విచక్షణకు వదిలేయాలన్నారు. అధికారులూ బాధ్యత గుర్తెరగాలి. ఈ విషయంలో సదరు వ్యక్తుల తరఫువాళ్ళు కోరుకొనేది గొడవలే అన్నారు. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తుని ఘటన, అధికారంలోకి వచ్చాక కోనసీమ ఘటన సృష్టించింది. కులాల మధ్య చిచ్చు రేపి ప్రయోజనం పొందాలని చూసింది. ఇప్పుడు మతాల మంట రేపాలని చూస్తోందన్నారు. తుని, కోనసీమ ఘటనల్లో ప్రజలు ఎంతో సంయమనంతో వ్యవహరించారన్నారు..

తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు, అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలని పవన్ సూచించారు. నాటి టీటీడీ బోర్డులను నియమించినవాళ్ళూ బాధ్యులే అన్నారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీపై వారే సమాధానం చెప్పాలన్నారు.