వాష్ రూమ్‌కి కూడా వెళ్లనివ్వరా.. విద్యార్థినిలను కరెంట్ వైర్‌తో చితకబాదిన లెక్చరర్

ఇంటర్ ఫస్టియర్‌లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు వాష్‌రూమ్‌కి వెళ్లారనే కారణంతో.. కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గువ్వల శ్రీనివాస్ రెడ్డి వారిపై మానవత్వం మరచి దారుణంగా దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని వికాస్ జూనియర్ కాలేజీలో చోటు చేసుకున్న ఘోర సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణ ఘటన పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాష్‌రూమ్‌కి వెళ్లారని కరెంట్ వైర్‌తో దాడి..

కాగా విద్యార్దినిలు మొదట పర్మిషన్ అడగ్గా సదరు టీచర్ పంపించేందుకు అనుమతి ఇవ్వలేదని విద్యార్దినిలు వాపోతున్నారు. ఆ తర్వాత చాలాసేపటి వరకు ఓపికతో ఉన్నప్పటికీ.. తప్పని పరిస్థితుల్లోనే వెళ్లాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కాగా తిరిగి వచ్చే క్రమంలో వాష్‌రూమ్‌కు వెళ్లిన విద్యార్థినులను, వైస్ ప్రిన్సిపల్ కరెంట్ వైర్‌తో కొట్టారని ఆరోపిస్తున్నారు. అయితే విద్యార్థినులు క్లాస్‌కు లేట్ అయినట్టు భావించి.. వైస్ ప్రిన్సిపల్ తీవ్ర ఆగ్రహంతో వారిని కరెంట్ వైర్‌తో వరుసగా కొట్టినట్లు స్టాఫ్ పేర్కొంటున్నారు. ఈ దాడి తీవ్రతకు విద్యార్థినులు అక్కడికక్కడే స్పృహ తప్పి నేలపై పడిపోయినట్లు సమాచారం.

విషయం బయటకు రాకుండా చేసే యత్నం..

అయితే తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన విద్యార్థినులను, ఘటన బయటకు పొక్కకుండా ఉండాలని ప్రయత్నించిన కాలేజీ యాజమాన్యం వాళ్లను వెంటనే ఓ ఆటోలో తీసుకెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో గుట్టుగా చికిత్స అందించినట్టు తెలుస్తోంది. ఆసుపత్రి సిబ్బంది కూడా అతి జాగ్రత్తగా వ్యవహరించడం.. కేసు నమోదు కాకుండా జాగ్రత్తపడటం అనుమానాలకు తావిస్తోంది.

ఇక చికిత్స అనంతరం ఇంటికి చేరిన విద్యార్థినుల నుంచి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వెల్లడించారు. విషయం తెలియడంతో తల్లిదండ్రులు ఆగ్రహంతో కాలేజీ సిబ్బందిని నిలదీశారు. వాష్‌రూమ్‌కు వెళ్లినందుకు ఇలా కొడతారా? అంటూ యాజమాన్యంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు కూడా విద్యార్థినులకు మద్దతుగా నిలబడ్డారు. యాజమాన్యం పై ఒత్తిడి పెరగడంతో, దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి పరారీలో ఉన్నట్టు సమాచారం. సంబంధిత ఉపాధ్యాయుడిపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.