Leopard: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో చిరుత.. భయాందోళనలో సిబ్బంది

www.mannamweb.com


Leopard at Shamshabad: నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విమానాశ్రయంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం వేకువజామున విమానాశ్రయంలోని పెట్రోలింగ్ సిబ్బంది రన్‌వే‌పై చిరుతను గుర్తించారు.

శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున చిరుత కనిపించడం అందరినీ కలవరపెడుతోంది. విధుల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి రన్‌వేపై చిరుత కనిపించింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగిలింది. దీంతో ఒక్కసారిగా ఎయిర్ పోర్ట్‌ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగిందని సిబ్బంది వెల్లడించారు. అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది.. సీసీటీవీలను పరిశీలించారు.

సీసీటీవీలో ఓ చిరుతతో పాటుగా రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అటవీ సిబ్బంది హుటాహుటిన ఎయిర్ పోర్ట్‌లోకి చేరుకున్నారు. చిరుతను, పిల్లలను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ చిరుత వారి కంట పడలేదు. దీంతో సిబ్బంది చిరుతకోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు.