సమష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళదాం: పవన్‌ కల్యాణ్

www.mannamweb.com


గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి కలిసి కట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు.

విజయవాడ: గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి కలిసి కట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు. కూటమి శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్‌ మాట్లాడారు.

‘‘తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. అందరం కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజారిటీలతో గెలిచాం. 164 శాసనసభ స్థానాలు, 21 ఎంపీలను ఎన్డీయే కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం ఇది. కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని ఇప్పటం సభలో చెప్పాం.. అదే మాటపై నిలబడ్డాం. ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం.. తగ్గాం.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. మనందరం సమష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతామని చెప్పాం.

ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి. నాలుగు దశాబ్దాల అనుభవం, అభివృద్ధిపై అపారమైన అవగాహన, పెట్టుబడులను తీసుకొచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల అధ్యక్షులను తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించే శక్తి ఉన్న చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరం. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను. అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పడిన బాధను చూశాను. మంచిరోజులు వస్తాయి.. కన్నీళ్లు పెట్టొద్దని చెప్పాను. ఆ రోజులు వచ్చాయి. చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నా.. అద్భుతమైన పాలన అందివ్వాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. ఈ సందర్భంగా పవన్‌ను చంద్రబాబు ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలిపారు.