LIC Public Notice: ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) బుధవారం పబ్లిక్ నోటీసు జారీ చేసింది. దేశ ప్రజలకు తీవ్ర హెచ్చరికలు చేసింది. ఎల్ఐసీతో పాటు తమ సంస్థకు చెందిన వ్యక్తుల పేరుతో వివిధ సోషల్ మీడియాల్లో మోసపూరిత ప్రకటనలు వస్తున్నాయని తెలిపింది. తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. అలాంటి మోసపూరిత, తప్పుడు ప్రకటనలపై ప్రజలు, పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
‘కొంత మంది వ్యక్తులు, సంస్థలు మా సంస్థ పేరు, బ్రాండ్‌తో వివిధ సోషల్ మీడియా అకౌంట్లలో తప్పుడు, మోసపూరిత ప్రకటనలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఎల్ఐసీకి చెందిన సీనియర్ ఉన్నతాధికారులు, మాజీ ఉద్యోగుల ఫోటోలు, బ్రాండ్ పేరు, లోగోను ఇందుకు వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలతో ప్రజలు, పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.’ అని ఎల్ఐసీ తన పబ్లిక్ నోటీసులో పేర్కొంది.
ఎల్ఐసీ పేరు, లోగోతో మోసపూరిత ప్రకటనలను గుర్తిస్తే వెంటనే ఎల్ఐసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా యూఆర్ఎల్స్ తమకు పంపించాలని సూచించింది జీవిత బీమా సంస్థ. అలాంటి వారిపై తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అధీకృత సమాచారం కోసం నేరుగా తమనే సంప్రదించాలని ప్రజలను కోరింది. మరోవైపు.. ఎల్ఐసీ పాలసీలు, స్కీమ్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు కనిపిస్తుంటాయి. అందులో వచ్చే పాలసీల వివరాలు చాలా వరకు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ లో కనిపించవు. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతుంటారు. అలాగే ఎల్ఐసీ లోగో చాటున సైబర్ నేరగాళ్లు మోసపూరిత లింకులను ఉంచి ప్రజల డబ్బులను దోచుకునే అవకాశమూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎల్ఐసీ ఈ పబ్లిక్ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో, ఆన్‌లైన్ వేదికగా ఎలాంటి లింకులను ఓపెన్ చేయకపోవడమే మంచింది. ఏదైనా సమాచారం కావాలంటే నేరుగా ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి తెలుసుకోవాలి.