Motivational story: జీవిత సత్యాన్ని చెప్పే రూపాయి కథ.. చదివితే ఆలోచన మారాల్సిందే

కథలు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. జీవిత సత్యాన్ని వివరంగా అర్థమయ్యేలా చెబుతాయి. అలాంటి ఒక కథ గురించి ఈరోజు తెలుసుకుందాం..


ఒక పెద్ద భవంతిలో భార్యభర్తలిద్దరూ జీవిస్తుంటారు. కోట్ల రూపాయల సంపాదన, కారు, మంచి ఇల్లు జీవితం బిందాస్‌గా ఉంటుంది. అయితే రాత్రి మాత్రం అస్సలు నిద్రపట్టదు. నిత్యం డబ్బుల గురించే ఆలోచిస్తూ నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అప్పు ఇచ్చిన వారు ఇస్తారా లేదా అన్న భయం. పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయా లేదా అన్న టెన్షన్‌. ఇవన్నింటితో వారికి రాత్రంతా నిద్రనే ఉండదు.

అయితే అదే భవంతికి ఎదురుగా ఓ పూరి గుడిసెలో ఓ పేద జంట ఉంటుంది. ప్రతీ రోజూ కూలి పని చేసుకునే వారు చేరో రూపాయి సంపాదించుకుంటారు. ఎంచక్క రూపాయితో బియ్యం, రూపాయితో కూరగాయలు తెచ్చుకుని తింటారు. రాత్రి బిందాస్‌గా ఎలాంటి టెన్షన్‌లో లేకుండా పడుకుంటారు. రేపు ఏమవుతుందో అన్న బాధ ఉండదు. ఉదయం మళ్లీ లేచి పనికి వెళ్తాం రెండు రూపాయలు వస్తాయి. వాటితో ఎంచక్కా తినొచ్చు. అంతే అంతకు మించి మరో ఆలోచన ఉండదు వారికి.

ఇదంతా పై నుంచి చూసిన పార్వతీ పరమేశ్వరుడిని ఓ ప్రశ్న అడుగుతుంది. ‘అదేంటి స్వామి అంత సంపాదన ఉన్న ఆ జంట నిద్రలేకుండా అలా ఇబ్బంది పడుతున్నారు. పూరిగుడిసెలో ఉన్న ఆ పేద జంట బిందాస్‌గా ఉంది. అసలేంటిది’ అంటూ ప్రశ్నిస్తుంది. చిరునవ్వు చిందిస్తూ పరమేశ్వరుడు.. “నువ్వే చూస్తూ ఉండు,” అని చెప్తాడు.

మరుసటి రోజు కూలి పనికి వెళ్లొస్తుండగా పేద జంట ముందు నాణేలు ఉన్న ఒక సంచిని పడేస్తాడు. సంచిని ఓపెన్‌ చూసిన ఆ జంట కాయిన్స్‌ను కౌంట్‌ చేయడం మొదలు పెడతారు. అవి మొత్తం రూ. 99 రూపాయలు ఉంటాయి. దీంతో వారిలో ఒక్కసారిగా ఆశ పుట్టుకొస్తుంది. రూ. 99కి ఒక్క రూపాయి కలిపితే రూ. 100 అవుతుంది కదా అని సంపాదించిన 2 రూపాయాల్లో ఒక రూపాయిని ఆ సంచిలో వేసి మూటకట్టి సజ్జపై పెట్టేస్తారు. మిగిలిన ఒక రూపాయితోనే తక్కువ మొత్తంలో బియ్యం, కూరగాయలు కొంటారు.

రోజూ తినేదానికంటే తక్కువ మొత్తంలో తినడం, ఆ వంద రూపాయాలతో ఏం చేయాలి.? వాటిని రూ. 200 ఎలా చేయాలన్న ఆలోచనతో ఆ పేద జంట ఆలోచించడం మొదలు పెడుతుంది. ఓవైపు సగం కడపు తినడం వల్ల కలుగుతోన్న ఆకలి, మరోవైపు ఆ డబ్బుతో ఏం చేయాలన్న ఆలోచనతో ఆ పేద జంటకు నిద్ర దూరమవుతుంది. ఎదురుగా బిల్డింగ్‌లో ఉన్న జంటలాగే వీరి జీవితం కూడా మారుతుంది. అప్పుడు పార్వతీకి అసలు విషయం అర్థమవుతుంది.

నీతి ఏంటంటే..

ఈ చిన్న కథ ఎంతో నీతిని బోధిస్తోంది. సంపద ఎక్కువైతే సంతోషం దూరమవుతుంది అని ఈ కథ చెప్పకనే చెబుతోంది. అయితే మనిషి బతకడానికి డబ్బు కావాలి కదా అనే ప్రశ్న రావడం సర్వసాధారణం. జీవితమనే పడవ ప్రయాణించాలంటే డబ్బు అనే నీళ్లు ఉండాల్సిందే. అయితే ఆ నీళ్లు పడవలోకి వస్తే పడవ మునిగి పోతుంది. అదే విధంగా జీవితంలోకి డబ్బు వస్తే జీవితం మునిగిపోతుంది. అందుకే డబ్బు మన అవసరాలను తీర్చాలి తప్ప, మన జీవితాన్ని శాసించకూడదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే అంతా సంతోషమే.