Life Facts: ఈ 5 విషయాలను పొరపాటున కూడా ఎవరితో షేర్ చేసుకోకూడదట.. !

మనసులో ఉన్న విషయాన్ని ఇతరులకు చెప్పడం చాలామంది చేసే పనే. కొందరికి ఏ చిన్న విషయమైనా బయటకు చెప్పే అలవాటు ఉంటుంది. సంతోషాన్ని బయటకు చెబితే వారి సంతోషం రెట్టింపు అవుతుందని, బాధ, దుఃఖం వంటివి బయటకు చెబితే మనసు భారం తగ్గుతుందని,, జీవిత ప్రణాళికలు, విజయాలు బయటకు చెబితే తమ ప్రతిభ అందరికీ తెలుస్తుందని అనుకుంటారు.


ఆప్తులతో లేదా తెలిసిన వారితో ఇలాంటి విషయాలు పంచుకుంటూ ఉంటారు. అయితే ఎంత ఆప్తులైనా, స్నేహితులనైనా.. ఆఖరికి కుటుంబ సభ్యులతో అయినా సరే ఈ 5 విషయాలను మాత్రం అస్సలు చెప్పకూడదట. ఇంతకీ ఆ 5 విషయాలేంటో తెలుసుకుంటే..

వైఫల్యాలు..

వైఫల్యాలు, ఓటమిని అంగీకిరించే వారు ఎవరికీ భయపడరని, వారికి జీవితం మీద అవగాహన ఎక్కువని, పరిపక్వత చెందిన వారని అంటుంటారు. కానీ వైఫల్యాలను బయటకు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రతి విషయానికి ఎగతాళి చేసేవారు చుట్టూ ఉండనే ఉంటారు. అలాంటి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉండటమే ఉత్తమం. లేకపోతే జీవితంలో ఎదగాలనే సంకల్పం ఉన్నా, విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నా మాటలతో వెనక్కే లాగేవారు ఉంటారు.

బలహీనతలు..

బలహీనతల గురించి ఎప్పుడూ బయటకు చెప్పకూడదు. బలహీనతలను ఎత్తి చూపి ఎగతాళి చేసే వారిని పక్కన పెడితే.. ఆ బలహీనతల ద్వారా లాభపడాలని చూసేవారు కొందరుంటారు. ఒకరి బలహీనతతో జీవితంలో ఎదగాలని ప్రయత్నం చేసేవారు కూడా ఉంటారు. కాబట్టి ఎంత ఆప్తుల దగ్గరైనా సరే.. బలహీనతలను బయటపెట్టకూడదు.

భవిష్యత్ ప్రణాళికలు..

భవిష్యత్ ప్రణాళికలు చాలామంది జీవితాలను ఎంతో అందంగా తయారుచేస్తాయి. అయితే భవిష్యత్ ప్రణాళికల గురించి ఇతరులసు చెప్పడం మంచిది కాదట. కొన్ని సార్లు ప్రణాళికలు వైఫల్యం చెందే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇతరులు ఎగతాళి చేయవచ్చు. మరికొన్ని సార్లు ప్రణాళికల గురించి ఇతరులకు చెప్తే వారు ఓర్వలేక ఆ ప్రణాళికలను అడ్డుకోవడం లేదా వాటి వైఫల్యానికి దారితీసే పరిస్థితులను సృష్టించడం చేయవచ్చు. అందుకే భవిష్యత్ కార్యాచరణలు ఎవరికీ చెప్పకూడదు.

సంపాదన..

డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరికీ నీ సంపాదన ఎంత అనే ప్రశ్న తప్పకుండా ఏదో ఒక సందర్బంలో ఎదురవుతూ ఉంటుంది. అలాంటి వారు తమ సంపాదన గురించి నిజాయితీగా సమాధానం చెప్పడం తప్పు. కొందరు గొప్పలకు పోయి ఉన్నదాని కంటే ఎక్కువే చెబుతుంటారు కూడా. కానీ వ్యక్తులను బట్టి ఈ సంపాదన విషయాన్ని ఎక్కువ లేదా తక్కువ చెప్పాలట. దీనివల్ల ఇతరుల ముందు చిన్నతనం కావడం లేదా ఇతరులకు డబ్బు ఇచ్చే పరిస్థితులు రావడం వంటివి జరగకుండా ఉంటాయి.

రహస్యాలు..

ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు ఉంటాయి. కొంతమంది తమకు ఎంతో దగ్గరైన వ్యక్తులనే ఆలోచనతో కొన్ని రహస్యాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి రహస్యాలను ఇతరులతో ఎప్పటికీ షేర్ చేసుకోకూడదు. ఇతరులు మీ మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడమే కాకుండా కొన్ని బలహీన సందర్బాలలో తమ మనసులో ఉన్న రహస్యాలను ఇతరులకు చెప్పడం వల్ల భవిష్యత్తులో బాధపడే సందర్భాలు వస్తాయి.