AP DSC Notification 2025: ఏపీలో డీఎస్సీకి లైన్ క్లియర్

ఏపీలో( Andhra Pradesh) ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.


కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భారీ డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుకున్నట్టే చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఫైల్ డీఎస్సీ పైనే సంతకం చేశారు. అన్నట్టుగానే 16 వేల పోస్టులను ప్రకటించారు. కానీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది కూటమి ప్రభుత్వం.

* ఇప్పటికే టెట్ పూర్తి..
అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ( DSC) నియామకానికి సంబంధించి ప్రక్రియ ప్రారంభం అయింది. అందులో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పూర్తి చేసింది. ఇక నోటిఫికేషన్ తరువాత పరిస్థితి ఉండేది. అయితే ఇంతలో ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియామకం చేపట్టింది. ఆ నివేదిక వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపడతారని.. అటు తరువాత డీఎస్సీ నియామకం చేపట్టాలని మందకృష్ణ మాదిగ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. దీంతో డీఎస్సీ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. అయితే ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పట్లో జరిగే పని కాదని తాజాగా తేలిపోయింది. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే.

* జన గణన తరువాత..
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన( census) చేయాల్సి ఉంది. అయితే 2021లో చేపట్టాల్సిన జనగణన కరోనా మూలంగా జరగలేదు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రక్రియ చేపట్టలేదు. 2026 లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మరో ఏడాదిలో జన గణన పూర్తి కానుంది. అది పూర్తయిన తరువాతనే ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు అవకాశం ఉందని ఏకసభ్య కమిషన్ స్పష్టం చేసింది. అంతవరకు ఎటువంటి సూచనలు చేయలేమని సంబంధిత కమిషన్ చెప్పినట్లు సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. అంటే 2026 వరకు జనగణన జరగదు. జనగణన జరిగితేనే ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది. అప్పటివరకు డీఎస్సీ నియామక ప్రక్రియ వాయిదా వేయడం కుదరదు. అందుకే డీఎస్సీ నోటిఫికేషన్ కు విద్యాశాఖ శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

* గత ఐదేళ్లలో నిల్
వాస్తవానికి గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించలేదు. ఎన్నికలకు ముందు 6000 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది జగన్ సర్కార్. కానీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయింది. ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం ఆ 6000 పోస్టులకు తోడు మరో పదివేల పోస్టులను కలుపుకొని తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. మొత్తానికైతే డీఎస్సీ నియామక ప్రక్రియకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది శుభవార్త. విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ఈలోపు ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.