చాలా మందికి తక్షణమే డబ్బు అవసరమైనప్పుడు.. బ్యాంకులకు వెళ్లడం, డాక్యుమెంట్స్ సమర్పించడం పెద్ద కష్టంగా ఉండేది. పాత రోజుల్లో లోన్ తీసుకోవాలంటే పే స్లిప్పులు, బ్యాంకు స్టేట్‌మెంట్‌లు..
రోజులు లేదా వారాల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుండే.. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. మీరు ఒక కప్పు టీ తాగడం పూర్తయ్యేలోపే లోన్ పొందవచ్చు. డ్రామా లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పని లేదు. కేవలం మీ ఫోన్, ఆధార్, పాన్ కార్డు ఉంటే చాలు, డబ్బు మీ అకౌంట్‌లో పడిపోతుంది. ఇదంతా ఎలా సాధ్యమవుతోంది అంటే.. దీని వెనుక ఉన్న టెక్నాలజీ eKYC. eKYC కారణంగా దేశంలో రుణాలు తీసుకునే విధానం పూర్తిగా మారిపోయింది.
eKYC అంటే ఏంటి..? ఎలా పనిచేస్తుంది..?
eKYC అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్. ఇది మీ గుర్తింపును పేపర్లు లేకుండా, నిమిషాల్లో ధృవీకరించే ప్రక్రియ.
సాధారణంగా జరిగేది ఇదే:
- మీరు లోన్ ఇచ్చే యాప్‌లో ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
- మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్‌కు OTP వస్తుంది.
- మీరు ఆ OTPని ఎంటర్ చేయగానే, లోన్ ఇచ్చే సంస్థ మీ పేరు, ఫోటో, పుట్టిన తేదీ వంటి వివరాలను UIDAI నుండి సురక్షితంగా తీసుకుంటుంది.
- దీంతో మీ ఐడెంటిటీ తక్షణమే ధృవీకరించడం జరుగుతుంది.
ఇలా అనుకోవచ్చు: “మీ ఆధార్ కార్డు, మీరు అడిగిన లోన్ ఇవ్వడానికి లోన్ ఇచ్చే సంస్థకు సైలెంట్‌గా హామీ ఇస్తోంది. పెద్ద మొత్తంలో లోన్ అయితే, కొందరు వీడియో KYC ద్వారా త్వరగా వీడియో కాల్‌లో మీ ముఖం, పాన్ కార్డును చూపించమని అడుగుతారు.
5 నిమిషాల లోన్ ప్రాసెస్ ఎలా..?
మీరు లోన్ యాప్‌లో దరఖాస్తు చేసిన తర్వాత, ఈ ప్రక్రియ ఇలా ఉంటుంది:
దరఖాస్తు: యాప్‌లో మీ పేరు, ఫోన్ నంబర్, పాన్ వివరాలు, ఎంత లోన్ కావాలో ఎంటర్ చేయాలి.
eKYC పూర్తి : ఆధార్ నంబర్, OTPతో మీ ఐడెంటిటీని ధృవీకరించడం.
ఆటోమేటిక్ చెకింగ్: యాప్ సిస్టమ్ మీ క్రెడిట్ స్కోర్ మీ UPI లావాదేవీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్, మీ ఆదాయ వివరాలను చెక్ చేస్తుంది. మీకు క్రెడిట్ హిస్టరీ లేకపోయినా మీ UPI లేదా ఇతర డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా లోన్ ఇచ్చే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి.
ఆఫర్ – eSign: మీకు లోన్ ఆఫర్ (ఎంత, వడ్డీ, ఈఎంఐ వివరాలు) కనిపిస్తుంది. మీకు నచ్చితే, ఆధార్ OTP ద్వారా డిజిటల్‌గా సంతకం చేస్తారు.
డబ్బు ట్రాన్స్‌ఫర్: లోన్ మొత్తం తక్షణమే మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
సామాన్యులకు ఇది ఎందుకు గేమ్-ఛేంజర్?
ఈ తక్షణ లోన్ విధానం సాధారణ ప్రజలకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది:
పే స్లిప్ లేనివారికి సహాయం: రోజువారీ కూలీలు, చిన్న దుకాణదారులు, గిగ్ వర్కర్లు, వంటివారికి స్థిరమైన శాలరీ స్లిప్స్ ఉండవు. కానీ వారి డిజిటల్ లావాదేవీల ఆధారంగా ఇప్పుడు లోన్ పొందే అవకాశం దొరుకుతుంది.
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో: అనారోగ్యం, వాహనం రిపేర్ లేదా ఇతర అత్యవసర ఖర్చుల సమయంలో బంగారం తాకట్టు పెట్టకుండా.. వేరే వ్యక్తి దగ్గర అప్పు తీసుకోకుండా సురక్షితమైన, తక్షణ పరిష్కారం లభిస్తుంది.
క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం: చిన్న లోన్ తీసుకొని సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు. ఇది భవిష్యత్తులో పెద్ద రుణాలు, తక్కువ వడ్డీ రేట్లతో పొందడానికి దారి తీస్తుంది.
లోన్ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సినవి
వేగంగా లోన్ వస్తుంది కదా అని తొందరపడకూడదు. ఈ చిట్కాలు గుర్తుంచుకోండి:
RBI ఆమోదం: RBI-రిజిస్టర్డ్ NBFC లేదా బ్యాంక్ మద్దతు ఉన్న యాప్‌లను మాత్రమే ఉపయోగించండి.
అనుమతుల పట్ల జాగ్రత్త: మీ కాంటాక్ట్‌లు, గ్యాలరీ, లొకేషన్ హిస్టరీ వంటి అనవసరమైన అనుమతులను అడిగే యాప్‌లను అస్సలు వాడకండి.
నిబంధనలు : లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ పేమెంట్ ఛార్జీలను తప్పకుండా తెలుసుకోండి.
తిరిగి చెల్లించగలిగేంతే: మీకు ఎంత అర్హత ఉన్నా మీరు సులభంగా తిరిగి చెల్లించగలిగే మొత్తాన్ని మాత్రమే లోన్‌గా తీసుకోండి.
సకాలంలో చెల్లించండి: మీ క్రెడిట్ స్కోర్ EMI లను సమయానికి చెల్లించడం చాలా ముఖ్యం.
తక్షణ లోన్ అనేది ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఒక అద్భుతమైన సాంకేతికత. దాన్ని తెలివిగా, బాధ్యతాయుతంగా ఉపయోగించుకోండి.
































