Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల వేళ భారత్‌పై చైనా కుట్రలు.. కేంద్రాన్ని అలర్ట్ చేసిన మైక్రోసాఫ్ట్

www.mannamweb.com


Lok Sabha Elections: ప్రస్తుతం దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికల సమరానికి తెరలేచింది. మరోసారి గెలిచి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని ఎన్డీఏ కూటమి ఆరాటపడుతుండగా.. నరేంద్ర మోదీ సర్కార్‌ను గద్దె దించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే దిగ్గజ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ కీలక విషయాలు వెల్లడించింది. భారత్‌లో జరగనున్న ఎన్నికల్లో డ్రాగన్ తలదూర్చే యత్నాలు చేస్తోందని మైక్రోసాఫ్ట్.. ఆందోళన వ్యక్తం చేసింది.

భార‌త్‌లో మరికొన్ని రోజుల్లో జ‌ర‌గ‌నున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో చైనా జోక్యం చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్-ఏఐని ఉపయోగించుకుని.. లోక్‌స‌భ ఎన్నిక‌లపై చైనా ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపింది. ఏఐ ఆధారిత సమాచారంతో భారత్‌తో పాటు అమెరికా, ద‌క్షిణ కొరియా దేశాల్లో ఉన్న ఎన్నిక‌ల‌పైన కూడా ప్రభావం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.
ఎన్నిక‌ల వేళ ఏఐ ఆధారిత సమాచారాన్ని సోష‌ల్ మీడియా వేదికగా ద్వారా ప్రచారం చేయ‌నున్నారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. భారత్‌లో కీల‌క‌ంగా ఉండే ఎన్నిక‌లు త‌మ‌కు అనుకూలంగా ఉండే రీతిలో చైనా ఆ ప్రచారం చేసే అవకాశం ఉందని పేర్కొంది. సోషల్‌ మీడియాలో మీమ్స్‌, డీప్‌ ఫేక్‌ ఫొటోలు, వీడియోలు, ఆడియోల రూపంలో ఆ కామెంట్ ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే చైనాకు మద్దతుగా ఉండే రీతిలో ఆ సోషల్ మీడియా కంటెంట్‌ను రూపొందించ‌నున్నారని వెల్లడించింది. ఇలాంటి ఎత్తుగ‌డ‌ల‌తో లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూప‌డం త‌క్కువే అన్న అభిప్రాయాన్ని కూడా మైక్రోసాఫ్ట్ వ్యక్తం చేసింది.
ఈ ఏడాది ప్రపంచంలోని దాదాపు 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ప్రపంచ జనాభాలో ఈ దేశాల వాటా 49 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది అభిప్రాయాలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ ఇంటిలిజెన్స్ టీమ్‌ హెచ్చరికల ప్రకారం.. చైనా కేంద్రంగా పనిచేసే కొన్ని సైబర్ గ్రూప్‌లు వివిధ దేశాల్లో జరిగే ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయని.. ఆ గ్రూప్‌లకు ఉత్తర కొరియాలోని మరికొన్ని గ్రూపులు సహాయం అందించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు చైనా మీద ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని తైవాన్‌లో చైనా విస్తృతంగా వ్యాప్తి చేయించిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇదే విధంగా వివిధ దేశాల్లో కూడా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్‌ను వినియోగించడం ఇదే తొలిసారి అని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.