బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన -కృష్ణా, గోదావరికి భారీ వరద – పరిసర ప్రాంతాలు అప్రమత్తం

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం దక్షిణ ఒడిశా, పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా,ఛత్తీస్గఢ్ వైపు కదిలే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.


ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

దీని ప్రభావంతో ఈరోజు (గురువారం) రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

ఈరోజు భారీ వర్షాలు పడేది ఇక్కడే

గురువారం(28-08-25)

అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.బుధవారం సాయంత్రం నాటికి మన్యం జిల్లా సీతంపేటలో 77మిమీ, కోనసీమ జిల్లా మలికిపురంలో 74.5మిమీ, భీమవరంలో 67.5మిమీ, విజయవాడ పశ్చిమలో 62.5మిమీ, విజయవాడ సెంట్రల్ లో 62మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

కృష్ణా గోదావరికి పోటెత్తిన వరద

ఎగువ రాష్ట్రాలతో పాటు ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో వివిధ ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.దీంతో పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పొంగిపొర్లే నదులు, కాలువలు,వాగులు దాటే ప్రయత్నం/స్నానాలు చేయడం లాంటివి చేయరాదన్నారు. ఇప్పటికే విజయవాడ లోని ప్రకాశం బ్యారేజి వద్ద నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉంది అని అధికారులు హెచ్చరించారు.

వినాయక మండపాల నిర్వాహకులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

వర్షాలు విపరీతంగా కురుస్తున్న వేళ వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్త లు తీసుకోవాలి అని అధికారులు సూచించారు. వినాయక నిమజ్జనాల్లో నదులు/కాలువల వద్ద హెచ్చరిక బోర్డులను పాటిస్తూ అధికారులకు సహకరించాలని* విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. అలాగే భారీ విగ్రహాలు ఏర్పాటు చేసిన చోట కరెంట్ తీగలు తెగిపడకుండా జాగ్రత్త లు తీసుకోవాలి అని అన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.