తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం(25వ తేదీ) ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
శనివారానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంబడి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని కారణంగా ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడి శనివారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఇక, రాష్ట్రంలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీలోని జిల్లాలకు విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక అలెర్ట్‌లు జారీ చేసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలెర్ట్, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే కొన్ని రోజులు వర్షాలు, గాలివానలు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇటు తెలంగాణలో గురు, శుక్రవారాల్లో భారీ, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాలు సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నల్లగొండ, సూర్యాపేటలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది.
































