Magnesium Foods : మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాలలో మెగ్నిషియం కూడా ఒకటి. ఇది మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. మెగ్నిషియం వల్ల కండరాల పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల మెగ్నిషియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మెగ్నిషియం మనకు వేటిల్లో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సముద్రపు చేపల ద్వారా మనకు ఎక్కువ మెగ్నిషియం లభిస్తుంది. ముఖ్యంగా ఈ చేపల ద్వారా మనకు ఒమెగా 3 ఆమ్లాలు కూడా లభిస్తాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. శనగలను తినడం వల్ల మనకు మెగ్నిషియంతోపాటు ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను సైతం మెరుగు పరుస్తాయి. దీంతోపాటు షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక శనగలను రోజూ తినాలి.
అరటి పండ్లు మనకు ఏ సీజన్‌లో అయినా సరే అందుబాటులో ఉంటాయి. వీటి ధర కూడా తక్కువే. వీటిని రోజూ తినడం వల్ల మనకు కావల్సినంత మెగ్నిషియం లభిస్తుంది. అలాగే అరటి పండ్లలో పొటాషియం, విటమిన్లు బి6, సి కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాల పనితీరును మెరుగు పరిచేందుకు సహాయం చేస్తాయి. దీంతోపాటు గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. బాదంపప్పులను రోజూ ఓ గుప్పెడు తింటున్నా కూడా మనం మెగ్నిషియం పొందవచ్చు. వీటిని తినడం వల్ల ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా మన శరీరానికి లభిస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాదు, షుగర్ లెవల్స్‌ను కూడా తగ్గిస్తాయి.
పాలకూరలో మెగ్నిషియంతోపాటు ఐరన్, విటమిన్ కె అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్వినోవాను ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా మెగ్నిషియం పొందవచ్చు. దీంతోపాటు ప్రోటీన్లు, ఫైబర్ కూడా మనకు లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. శరీరానికి కావల్సిన అమైనో ఆమ్లాలను అందిస్తాయి. అవకాడోలు, రాజ్మా, గుమ్మడికాయ విత్తనాలు, డార్క్ చాకొలెట్ వంటి వాటిని తినడం వల్ల కూడా మనకు మెగ్నిషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక వీటిలో కనీసం ఏవైనా రెండు ఆహారాలను రోజూ తింటే ఫలితం ఉంటుంది.