Maharaja Review: రివ్యూ: మహారాజ.. విజయ్‌ సేతుపతి 50వ మూవీ మెప్పించిందా?

Maharaja Review; చిత్రం: మహారాజ; నటీనటులు: విజయ్‌ సేతుపతి, అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌దాస్‌, నటరాజ్‌, భారతీరాజా, అభిరామి తదితరులు; సంగీతం: అజనీశ్‌ లోకనాథ్‌; ఎడిటింగ్‌: ఫిల్లోమిన్‌ రాజ్‌; సినిమాటోగ్రఫీ: దినేశ్ పురుషోత్త‌మ‌న్‌; నిర్మాత: సుదర్శన్‌ సుందరమ్‌, జగదీశ్‌ పళనిస్వామి; రచన, దర్శకత్వం: నిథిలన్‌ స్వామినాథన్‌; విడుదల: 14-06-2024


ప‌రిపూర్ణ‌మైన న‌టుడు విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi). క‌థ.. చేసే పాత్ర‌లో వైవిధ్య‌త క‌నిపించాలే కానీ హీరో, విల‌న్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అని లెక్క‌లేసుకోకుండా బ‌రిలో దిగిపోతారాయ‌న‌. ఇప్పుడాయ‌న త‌న 50వ సినిమాగా మ‌హారాజా (Maharaja Review) అనే చిత్రంతో బాక్సాఫీస్ ముందుకొచ్చారు. మ‌రి ఈ మ‌హారాజా క‌థేంటి? సినీప్రియుల్ని ఏ మేరకు మెప్పించింది?

క‌థేంటంటే: మ‌హారాజా (విజ‌య్ సేతుప‌తి) ఓ బార్బ‌ర్‌. ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకుంటాడు. అత‌నికంటూ మిగిలిన‌ ఒకే తోడు కూతురు జ్యోతి. త‌ను ఆ బిడ్డ‌తోనే క‌లిసి సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. మ‌హారాజా ఓరోజు ఒంటి నిండా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్ గ‌డ‌ప తొక్కుతాడు. ముగ్గురు ఆగంత‌కులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని.. ఈ క్ర‌మంలోనే త‌మ బిడ్డ ప్రాణాల్ని కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లిపోయార‌ని.. ఎలాగైనా స‌రే ఆ ల‌క్ష్మిని వెతికి పెట్ట‌మ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాడు. మ‌రి మ‌హారాజా చెప్పిన ఆ ల‌క్ష్మి ఎవ‌రు? అతని ఫిర్యాదును స్వీక‌రించ‌డానికి పోలీసులు తొలుత ఎందుకు నిరాకరించారు? (Maharaja Review in telugu) అస‌లు మ‌హారాజ‌పై దాడి చేసిన ముగ్గురు వ్య‌క్తులెవ‌రు?వాళ్లకు అత‌నికి ఉన్న విరోధం ఏంటి? అన్న‌ది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే: ఇదొక భిన్న‌మైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. అంత‌ర్లీనంగా క‌ర్మ సిద్ధాంతం అనే పాయింట్‌తో ముడిప‌డి ఉంటుంది. నిజానికి ఈ క‌థ‌ను ఓ లైన్‌గా చూసిన‌ప్పుడు రొటీన్ రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగానే క‌నిపిస్తుంది. కానీ, ద‌ర్శ‌కుడు స్క్రీన్‌ప్లేను ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపిన తీరు.. విజ‌య్ సేతుప‌తి విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. ఇది ఓ సింపుల్ పాయింట్‌లా స‌రదా స‌ర‌దాగా మొద‌లై.. ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్టుల‌తో భావోద్వేగ‌భ‌రితంగా ముగుస్తుంది. ముఖ్యంగా ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో వ‌చ్చే మ‌లుపులు.. సేతుప‌తి యాక్ష‌న్ హంగామా బాగా ఆక‌ట్టుకుంటాయి.

మ‌హారాజాగా సేతుప‌తి పాత్ర‌ను చాలా సింపుల్‌గా ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు ఆ త‌ర్వాత అస‌లు క‌థ‌లోకి తీసుకెళ్ల‌డానికి చాలా స‌మ‌య‌మే తీసుకున్నాడు. ప్ర‌థమార్ధంలో ఎక్కువ భాగం పాత్ర‌ల ప‌రిచ‌యాల‌కే కేటాయించారు. కానీ, ద‌ర్శ‌కుడు ప్ర‌తి పాత్ర‌నూ తీర్చిదిద్దుకున్న తీరు వ‌ల్ల సినిమా ఎక్క‌డా బోర్ కొట్టిన ఫీల్ క‌ల‌గ‌దు. ల‌క్ష్మిని వెతికి పెట్టాలంటూ మ‌హారాజా పోలీస్ స్టేష‌న్‌లో అడుగు పెట్ట‌డం.. త‌న‌పై జ‌రిగిన దాడిని వివ‌రించే తీరు.. ల‌క్ష్మీ ఎవ‌ర‌న్న‌ది తెలిశాక పోలీసులు స్పందించే విధానం.. స్టేష‌న్‌లో త‌న‌కు ఎదుర‌య్యే అవ‌మానాలు.. అన్నీ ఓవైపు ఆస‌క్తిరేకెత్తిస్తూనే మ‌రోవైపు న‌వ్విస్తుంటాయి. మ‌రోవైపు దీనికి స‌మాంత‌రంగా ఓ దోపిడీ ముఠా చేసే అకృత్యాల‌ను.. ఇంకోవైపు మహారాజా కూతురు జ్యోతి ఎపిసోడ్‌ను చూపిస్తూ క‌థ‌లోని ఒక్కో చిక్కుముడిని ఆవిష్కరిస్తూ వెళ్లాడు ద‌ర్శ‌కుడు. (Maharaja Review in telugu) ఆరంభంలో ఇవ‌న్నీ ఒక‌దానితో మ‌రొక‌టి సంబంధం లేని వేరువేరు ఎపిసోడ్స్‌లా క‌నిపించినా విరామానికి వ‌చ్చే స‌రికి వీట‌న్నింటికీ మ‌ధ్య ఏదో లింక్ ఉన్న‌ట్లు ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌వుతూనే ఉంటుంది. దీనికి త‌గ్గ‌ట్లుగానే ఓ థ్రిల్లింగ్ సీక్వెన్స్‌తో విరామ‌మిచ్చిన తీరు మెప్పిస్తుంది.

ఇక అక్క‌డి నుంచి అనూహ్య‌మైన మ‌లుపుల‌తో ద్వితీయార్ధ‌మంతా ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. అస‌లు మ‌హారాజాకు జ‌రిగిన అన్యాయ‌మేంటి? ఎన్ని అవ‌మానాలు ఎదురైనా ల‌క్ష్మిని వెతికి పెట్టాలంటూ మ‌హారాజా పోలీస్ స్టేష‌న్ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాడు? వ‌రుస హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌ల ముఠాతో అత‌నికి ఉన్న విరోధ‌మేంటి? ఈ చిక్కుముడుల‌న్నింటినీ ఒకొక్క‌టికీ విప్పిన తీరు మెప్పిస్తుంది. త‌న బిడ్డ విష‌యంలో మ‌హారాజాకు జ‌రిగిన న‌ష్టం అంద‌ర్నీ షాక్‌కు గురి చేస్తుంది. ప్ర‌తి ఒక్క‌రి మ‌దిని బ‌రువెక్కిస్తుంది. అత‌ని క‌డుపుకోత గురించి అర్థ‌మ‌య్యాక పోలీసులు త‌న ప‌గ‌లో భాగ‌మైన తీరు చ‌ప్ప‌ట్లు కొట్టిస్తుంది. (Maharaja Review in telugu) ఇక ప‌తాక స‌న్నివేశాల్లో బాధిత యువ‌తిగా ప్ర‌ధాన ప్ర‌తినాయ‌కుడితో జ్యోతి చెప్పే డైలాగ్స్ స్ఫూర్తి ర‌గిలించేలా ఉంటాయి. అలాగే ఆ వ్య‌క్తికి జ్యోతికి ఉన్న బంధం భావోద్వేగానికి గురి చేస్తుంది. ఈ క‌థ‌కు ముగింపు ప‌లికిన తీరు ప్రేక్ష‌కుల‌కు మంచి హై ఇస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: మ‌హారాజా పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆద్యంతం క‌ట్టిప‌డేశాడు. ఆయ‌న న‌ట‌నే సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. త‌న క‌ళ్ల ముందు జ‌రిగిన ప్ర‌మాదంలో భార్య‌ను కోల్పోయిన‌ప్పుడు క‌ళ్ల‌తోనే ఆయ‌న పండించే భావోద్వేగాలు.. ల‌క్ష్మిని వెతికి పెట్టాలంటూ అమాయ‌క‌మైన న‌ట‌న‌తో త‌ను పంచే న‌వ్వులు.. త‌న‌ కూతురికి అన్యాయం చేసిన వాళ్ల‌ను వెంటాడి హ‌త‌మార్చే తీరు.. ఈ క్ర‌మంలో చేసే మాస్ యాక్ష‌న్ హంగామా.. అన్నీ సేతుప‌తిలోని న‌ట‌నా ప్ర‌తిభ‌కు అద్దం ప‌డ‌తాయి. ఆయ‌న కూతురిగా జ్యోతి పాత్ర‌లో స‌చిన న‌ట‌న మెప్పిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో ఆమె ప‌లికే సంభాష‌ణ‌లు ప్రేక్ష‌కుల‌తో చ‌ప్ప‌ట్లు కొట్టిస్తాయి. ప్ర‌ధాన ప్ర‌తినాయ‌కుడిగా సెల్వం పాత్ర‌లో అనురాగ్ క‌శ్య‌ప్ అద‌ర‌గొట్టాడు. ద‌ర్శ‌కుడు ఆ పాత్ర‌ను తీర్చిదిద్దుకున్న తీరు.. ఆ పాత్రతో జ్యోతికి ఉన్న బంధం అన్నీ థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఎస్సైగా న‌ట్టి పాత్ర‌కు సినిమాలో మంచి ప్రాధాన్య‌త ఉంది. ఆ పాత్ర ప‌తాక స‌న్నివేశాల్లో అంద‌రి మ‌న‌సుల్ని దోచుకుంటుంది. మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌, భార‌తీరాజా, మ‌ణికంద‌న్‌, అరుళ్‌దాస్‌ త‌దిత‌రుల పాత్ర‌ల‌న్నీ ప‌రిధి మేర‌కు ఉంటాయి. ద‌ర్శ‌కుడు క‌థ‌ను న‌డిపించిన తీరు మెప్పిస్తుంది. అయితే ఇది ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు గంద‌ర‌గోళంగా అనిపించే అవ‌కాశ‌ముంది. ఇక ఈ చిత్రంలో తండ్రీబిడ్డ‌ల ఎమోష‌న్‌ను ఆవిష్క‌రించిన తీరు.. ఓ సున్నిత‌మైన అంశాన్ని అంతే ప్ర‌భావ‌వంతంగా చెప్పిన విధానం అన్నీ మెప్పిస్తాయి. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతం సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. ఫిలోమిన్ ఎడిటింగ్ ప్ర‌తిభ‌.. దినేశ్ ఛాయాగ్ర‌హ‌ణం ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

బలాలు
+ క‌థ‌, స్క్రీన్‌ప్లే
+ విజ‌య్ సేతుప‌తి న‌ట‌న‌
+ ద్వితీయార్ధంలోని ట్విస్ట్‌లు, మ‌లుపులు
బ‌ల‌హీన‌త‌లు
– నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం
– కొన్ని హింసాత్మ‌క స‌న్నివేశాలు
చివ‌రిగా: థ్రిల్ చేస్తారు మ‌హారాజా! (Maharaja Review in telugu)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే