ఆంధ్ర కశ్మీర్ లంబసింగి పర్యాటకాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. పర్యాటకుల విశేష ఆదరణ పొందిన లంబసింగిలో మెరుగైన సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా శిథిలమైపోయిన రూథర్‌ఫర్డు అతిథి గృహాన్ని ట్రైబల్ రైట్స్ మెమోరియల్ పార్కుగా, చెరువులవేనంలో అద్దాల బ్రిడ్జి, వ్యూ డెక్, రోప్ వేల నిర్మాణాలకు పర్యాటకశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థలం కేటాయించాలని రెవెన్యూశాఖకు పర్యాటకశాఖ లేఖ రాసింది.
చింతపల్లి మండలంలోని లంబసింగికి ప్రత్యేక ఉంది. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 3,300 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ వాతావరణం ఉత్తర భారతదేశాన్ని పోలి వుంటుంది. డిసెంబరు, జనవరి నెలల్లో ఒకటి, రెండు, సున్న, మైనస్ డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పర్యాటక సీజన్‌లో దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం లంబసింగిలో పర్యాటకుల కోసం మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ ప్రారంభించింది.
ట్రైబల్ రైట్స్ మెమోరియల్ పార్కుగా రూథర్డ్‌ఫర్డు అతిథి గృహం
బ్రిటిష్ అధికారులు లంబసింగిలో నిర్మించిన రూథర్డ్‌ఫర్డు అతిథి గృహాన్ని 25 ఏళ్ల క్రితం సీపీఐ మావోయిస్టులు పేల్చివేశారు. నాటి నుంచి ఈ అతిథి గృహాన్ని ఆధునికీకరించకపోవడంతో శిథిలమైపోయింది. ఈ అతిథి గృహాన్ని ట్రైబల్ రైట్స్ మెమోరియల్ పార్కుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిటిష్ అధికారులు నిర్మించిన అతిథి గృహం తరహాలో ఆధునిక భవనంతో పాటు సందర్శకులు విశ్రాంతి తీసుకునేందుకు ఆహ్లాదకర వాతావరణంలో పార్కుగా తీర్చిదిద్దనున్నారు.
పర్యాటక కేంద్రంగా చెరువులవేనం
లంబసింగికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులవేనం ప్రకృతి అందాలకు నిలయంగా పేరొందింది. చెరువులవేనం కొండపైన మంచు మేఘాలు సందర్శకులను మంత్రముగ్ధ్దులను చేస్తాయి. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో చెరువులవేనాన్ని ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటకశాఖ పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రధానంగా చెరువులవేనంలో వ్యూపాయింట్‌పై నుంచి ప్రకృతి అందాలను అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వీక్షించేందుకు అనువుగా విస్తరిస్తారు. పర్యాటకులకు అవసరమైన మరుగుదొడ్లు, వాష్‌రూమ్‌లు, కాఫీ కేఫ్, పర్యాటకులు కూర్చోవడానికి కుర్చీలు, వాహనాల పార్కింగ్ స్థలం, టిక్కెట్ కౌంటర్ నిర్మించనున్నారు. అద్దాల బ్రిడ్జి, భారీ వ్యూ డెక్, పిల్లల ఆట స్థలంతో పాటు కొండ పైనుంచి దిగువ వరకు రోప్ వే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా లంబసింగిలో పర్యాటకాభివృద్ధికి పర్యాటకశాఖ స్థలం కేటాయించాలని రెవెన్యూశాఖను కోరిందని తాజాగా బదిలీపై విశాఖపట్నం వెళ్లిన తహశీల్దార్ టి.రామకృష్ణ తెలిపారు. రూథర్‌ఫర్డు అతిథి గృహాన్ని ట్రైబల్ రైట్స్ మెమోరియల్ పార్కుగా అభివృద్ధి చేసేందుకు 2.67 ఎకరాలు, చెరువులవేనంలో కొండపై పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పనకు మూడు ఎకరాలు, చెరువులవేనం ముఖ ద్వారంలో వాహనాల పార్కింగ్ కోసం ఒక ఎకరం స్థలం కావాలని కోరిందన్నారు. రూథర్‌ఫర్డు అతిథి గృహం అభివృద్ధికి రెవెన్యూశాఖ ద్వారా నాలుగు నెలల క్రితం ప్రత్యేక వీడియో డాక్యుమెంట్ తీసి ప్రభుత్వానికి పంపినట్టు ఆయన తెలిపారు.
































