సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్ వచ్చింది.
ఎప్పుడు? ఎప్పుడు? ఎప్పుడు? దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా నుంచి తమ అభిమాన కథానాయకుడి లుక్కు విడుదల అయ్యేది ఎప్పుడు? అంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా వాళ్ళకు ఓ అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. ఎస్ఎస్ఎంబి 29 నుంచి మహేష్ ప్రీ లుక్ విడుదల చేశారు.
రాజమౌళి సినిమాలో మహేష్ ప్రీ లుక్ చూశారా?
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా హీరోగా ఆయన 29వది. అందుకని, ఎస్ఎస్ఎంబి 29 (SSMB29) అని వ్యవహరిస్తున్నారు. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్ విడుదల చేస్తారని ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఫస్ట్ లుక్ ఇవ్వలేదు గానీ… ప్రీ లుక్ విడుదల చేశారు రాజమౌళి.
మహేష్ బాబు ముఖాన్ని రాజమౌళి చూపించలేదు. అయితే… హీరో మెడలో ఆ పరమశివుని త్రిశూలంతో పాటు ఢమరుకం, నామాలు, నంది, రుద్రాక్షతో కూడిన ఒక లాకెట్ ఉన్నట్టు చూపించారు. అలాగే, మెడ నుంచి కారుతున్న రక్తం గమనిస్తే హీరోకి ఏదో గాయమైనట్టు అర్థం అవుతోంది. ఫైట్ సీక్వెన్స్ నుంచి తీసిన స్టిల్ అని అర్థం చేసుకోవచ్చు.
నవంబర్ నెలలో ఫస్ట్ రివీల్… లుక్కుతో పాటు వీడియో!?
మహేష్ హీరోగా తాను దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గ్లోబ్ ట్రాటర్’ (Globe Trotter) అని రాజమౌళి స్పష్టం చేశారు. అలాగే, ఈ సినిమా ఫస్ట్ రివీల్ నవంబర్ నెలలో అని మరో అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ రివీల్ అంటే కేవలం లుక్కు మాత్రమే కాదని, ఒక వీడియో కూడా రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మహేష్ బాబు, రాజమౌళి సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో గ్లోబల్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, మలయాళ స్టార్ – ‘సలార్’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన తమిళ హీరో మాధవన్ సైతం నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు.
































