సంక్రాంతి హిందువులు జరుపుకునే అతి పెద్ద పండగ. ఈ రోజు కోసం అయ్యప్ప స్వామి భక్తులు ఎంతగానో ఎదురు చూస్తారు. సంక్రాంతి రోజున శబరిమలలో అయ్యప్ప స్వామీ జ్యోతి రూపంలో దర్శనం ఇస్తాడని నమ్మకం. దీంతో హరిహర సుతుడిని జ్యోతిస్వరుపుడుగా భావించి మకర జ్యోతి’ని వీక్షించటానికి వేలాది భక్తులు పోటెత్తుతారు. ఈ నెల 14న మకర జ్యోతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివస్తున్నారు. మరో వైపు ప్రతి సంవత్సరం మకర జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్ప స్వామికి అలంకరించే ఆభరణాలను పందళం నుంచి శబరిమలకు తీసుకుని వెళ్తున్నారు. వీటిని జ్యోతి దర్శనం రోజున అలంకరిస్తారు.
మకర జ్యోతి దర్శనం అంటే మకరవిళక్కు శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో జరిగే ముఖ్యమైన వార్షిక వేడుక. ఇది శబరిమల ఆలయంలో దర్శనం ఇచ్చే పవిత్రమైన కాంతి.. దీనిని మకర జ్యోతి అని పిలుస్తారు. మకరవిళక్కు 2025 జనవరి 14న నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మకర జ్యోతి దర్శనం కోసం దేశవ్యాప్తంగా మిలియన్ల మంది భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. మకర జ్యోతిని ప్రత్యక్షంగా దర్శించుకోలేని వారు లైవ్ స్ట్రీమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో దర్శించుకోవచ్చు. మకర జ్యోతి దర్శనానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమె ఉంది. ఈ రోజు ప్రాముఖ్యత , శబరిమల ఆలయ దర్శన వేళలు, భక్తులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం..
మకర జ్యోతి ఎప్పుడు?
2025 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. శబరిమల ఆలయం నుంచి మకర జ్యోతి దర్శనం సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది. ఆకాశంలో నక్షత్రంలా కనిపించే ఈ కాంతిని దర్శించుకోవడం వలన జీవితంలో ఆనందం, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజలు నమ్ముతారు. ఈ నేపధ్యంలో సంక్రాంతి సమయంలో మకర జ్యోతిని దర్శనం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య జరుగుతుంది.
మకర జ్యోతి ప్రాముఖ్యత
శబరిమల ఆలయంలో సంక్రాంతి రోజున మకరవిళక్కు ఉత్సవం జరుగుతుంది. ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని కేరళ ప్రజలు జరుపుకునే విధానం. మకరవిళక్కు అనేది పొన్నంబలమేడు అడవిలో ఉన్న మలయమాన్ కారి వారసులుగా భావించబడే మలయరాయ తెగ వారు పూర్వకాలం నుంచి ఆచరిస్తున్న మతపరమైన ఆచారంలో ఒక భాగం. మకర జ్యోతిని చూసేందుకు ప్రతి సంవత్సరం సగటున లక్షన్నర మంది శబరిమలకు చేరుకుంటారని అంచనా.
అయ్యప్ప ఆభరణాలు
మకర జ్యోతి అంటే కాంతిని వ్యాప్తి చేయడానికి, రేపు ఆశాజనకంగా ఉండేలా చేసే అత్యంత ముఖ్యమైన ఆచారం అని నమ్మకం. ఈ పండుగలో తిరువాభరణం (అయ్యప్ప స్వామికి అలంకరించే పవిత్ర ఆభరణాలు) ఊరేగింపు ప్రధాన ఆకర్షణ. ప్రతి సంవత్సరం మకర జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్ప కి అలంకరించే ఆభరణాలను పందళం నుంచి తీసుకుని శబరిమలకు పయనం అవుతారు. పందళ వంశస్థులు అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలను తయారు చేయించి ప్రతి సంవత్సరం జ్యోతి దర్శనం రోజున అలంకరిస్తారు. ఈ బంగారు ఆభరణాలను పందళ రాజ్యం నుంచి 3 రోజుల పాటు ప్రయాణం చేసి రేపు సాయంత్రం అయ్యప్ప సన్నిదానానికి చేరుకుంటారు.