జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో పనిచేసిన బ్రాంచ్ మేనేజర్ ఒకరు లోన్ రెన్యువల్ పేరుతో వినియోగదారుడికి చెందిన 28 గ్రాముల బంగారాన్ని అక్రమంగా అమ్ముకుని పరారయ్యాడు.
ఇక మోసపోయిన బాధితుడిని ఇప్పుడు ఆ మేనేజర్ ‘సూసైడ్’ బెదిరింపులతో భయపెడుతున్నాడు.
సంఘటన వివరాలు..
మల్దకల్ మండలానికి చెందిన రాముడు అనే వ్యక్తి గద్వాల మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో బంగారాన్ని తాకట్టు పెట్టాడు. వడ్డీ, అసలు చెల్లింపు గడువు దాటడంతో, అప్పటి బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్ రాముడికి ఫోన్ చేసి, “వెంటనే రెన్యువల్ చేయకపోతే నీ బంగారం పోతుంది” అని భయపెట్టాడు. ఉద్యోగి మాటలు నమ్మిన రాముడు, బ్రాంచ్‌కు వెళ్లగా, మేనేజర్ మహమ్మద్ రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేయించి, అన్ని సంతకాలు, ఓటీపీలు తీసుకున్నాడు. రాముడు అప్పుడే డబ్బులు కట్టకపోయినా, మహమ్మద్ ఫిబ్రవరిలో ఉన్న లెక్క ప్రకారం “రెండు రోజుల్లో మొత్తం డబ్బులు ₹1,68,000 కట్టి బంగారం తీసుకెళ్లు” అని చెప్పి పంపేశాడు. అయితే, రాముడు డబ్బులు సర్దుబాటు చేయలేక 15 రోజుల పాటు బ్రాంచ్‌కు రాలేదు.
బంగారం అమ్ముకుని మేనేజర్ పరారీ..
గత 15 రోజుల క్రితం రాముడు తన బంగారం రిలీజ్ చేసుకునేందుకు వెళ్లగా, బ్రాంచ్‌లో కొత్త మేనేజర్ ఉన్నాడు. మీ బంగారం మీరే డబ్బులు కట్టి, సంతకాలు పెట్టి రిలీజ్ చేసుకున్నారు అని కొత్త సిబ్బంది చెప్పడంతో రాముడు అవాక్కయ్యాడు. ప్రస్తుత మేనేజర్ పాత మేనేజర్ మహమ్మద్‌కు ఫోన్ చేసి అడగగా అసలు విషయం బయటపడింది. “రాముడు రాకపోవడంతో, అతనికి తెలియకుండానే నేను బంగారం రిలీజ్ చేసుకుని అమ్మేశాను” అని మహమ్మద్ ఒప్పుకున్నాడు.
రూ.80 వేలు ఇస్తానంటూ బాధితుడికి బెదిరింపు..
తాకట్టు పెట్టిన బంగారం మోసపోవడంతో రాముడు, “నేను ఇప్పుడు డబ్బులు కడతాను, నా గోల్డ్ నాకు ఇవ్వాలి” అని మహమ్మద్‌ను నిలదీశాడు. దీనికి మహమ్మద్, “రెన్యువల్స్ చేసినప్పుడే రెండు రోజుల్లో అమౌంట్ తెస్తా అన్నావ్. నిన్ను నమ్మి నేను డబ్బులు కట్టి గోల్డ్ నా దగ్గర పెట్టుకున్న నెల రోజులైనా నువ్వు నాకు స్పందించలేదు, అందుకే గోల్డ్ అమ్మేశాను. ఇప్పుడు నీకు కేవలం ₹80,000 ఇస్తాను, నన్ను ఇంకా ఇబ్బంది పెడితే నేను ‘సూసైడ్’ చేసుకుంటాను” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
పోలీసుల వివరణ..
ఈ సంచలన విషయంపై గద్వాల పట్టణ సీఐ టంగుటూరి శ్రీనివాస్ ను వివరణ కోరగా, “మాకు ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదు. మోసానికి గురైనవారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే, తక్షణమే విచారణ చేపట్టి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని స్పష్టం చేశారు.

































