చిన్నారి హత్య కేసులో అనేక అనుమానాలు

అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను కన్న తండ్రే అతి పాశవికంగా హతమార్చాడు. కళ్లకు గంతలు కటి, రెండు కాళ్లకు తాడు కట్టి, రెండు చేతులను వెనక్కి వంచి కదలకుండా తాడుకట్టి, నీళ్ల బకెట్లలో తలలు ముంచి ఊపిరి తీశాడు.


ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావునగర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం కాకినాడ జిజిహెచ్‌లో ఇద్దరు చిన్నారులు, తండ్రి చంద్రకి షోర్‌ మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. సర్పవరం సిఐ పెద్దిరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన వానపల్లి చంద్రకిషోర్‌ (37) కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జిసి కార్యాలయంలో అసిస్టెంట్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. నగరంలోని తోట సుబ్బారావునగర్‌ రోడ్డులోని భూదేవి అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఏడేళ్ల క్రితం తనూజతో వివాహమైంది. వారికి జోషిల్‌ (6), నిఖిల్‌ (5) పిల్లలు ఉన్నారు. వారు సరిగా చదవకపోవడంతో ఇటీవల పాఠశాలను మార్పించారు. హోలీ పండుగ సందర్భంగా తన భార్య, పిల్లలను తీసుకుని వాకలపూడిలోని తమ ఆఫీసులో వేడుకకు వెళ్లాడు. పిల్లలకు యూనిఫాం కుట్టించేందుకు టైలర్‌ వద్దకు వెళ్తున్నానని, పది నిమిషాల్లో వస్తానని భార్యను అక్కడే ఉండమని చెప్పి పిల్లలను వెంట తీసుకెళ్లారు. పిల్లలను ఇంటికి తీసుకెళ్లి అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం తానూ ఉరేసుకుని చంద్రకిషోర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్‌ నోట్‌లో రాసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, పిల్లల మృతిపై పోలీసులు, స్థానికులు పలు అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలను ఒకేసారి ఎలా చంపి ఉంటారని ఆరా తీస్తున్నారు. ఇంత జరుగుతున్నా పక్క ప్లాట్లలలో నివసిస్తున్న వారికి వినిపించకుండా పకడ్బందీగా ఎలా చేయగలిగారనే దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫీజులు చెల్లించలేకపోవడం, సరిగా చదవకపోవడం వంటి చిన్న కారణానికే ముక్కుపచ్చలారని చిన్నారులను పొట్టన పెట్టుకునే కర్కస మనస్తత్వం తండ్రికిలేదని బంధువులు పేర్కొనడం గమనార్హం. భార్య తనూజ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.