తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
వీరిలో ఓ చిన్నారితోపాటు ముగ్గురు మహిళలు ఉన్నారు. డిండిగల్-తిరుచ్చి హైవేలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మరికొందరు పేషెంట్లు, సిబ్బంది మంటల్లో చిక్కకున్నారు.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఫైరింజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. పోలీసులు, రెస్క్యూ బలగాలు ఆస్పత్రిలో చిక్కుకున్న రోగులు, సిబ్బందిని బయటికి తీసుకువస్తున్నారు. గాయపడినవారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న 40కి పైగా అంబులెన్స్‌లు గాయపడినవారిని చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. ఘటన జరిగిన ప్రాంతానికి జిల్లా కలెక్టర్ పూంగోడి, పళని ఎమ్మెల్యే ఐబీ సెంథిల్‌కుమార్ చేరుకున్నారు.
పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభించారు. రిసెప్షన్ ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్ధరించారు. ఆ తర్వాత ఇతర అంతస్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని కొందరు, భారీగా ఎగిసిన మంటలు, పొగతో ఊపిరాడక మరికొందరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
దిండిగల్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ పూంగోడి ఈ ప్రమాద ఘటనపై మాట్లాడుతూ.. రెండు గంటల క్రితం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఇక్కడి రోగులను రక్షించి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించారు. కొంత మంది ప్రాణనష్టం సంభవించవచ్చు. అయితే మృతుల సంఖ్యను.. వైద్యులు ధృవీకరించిన తర్వాత మాత్రమే నిర్ధరిస్తామని చెప్పారు.