వందేభారత్ రైల్లో అనూహ్య ఘటన చోటు చేసుకొంది. భోజనం అందించిన సిబ్బందిపై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. శాకాహారి అయిన ఆయనకు మాంసాహార భోజనం అందించడమే అందుకు కారణం.
ఇటీవల ఓ పెద్దాయన పశ్చిమబెంగాల్‌లోని హావ్‌డా నుంచి రాంచీకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. భోజనం వేళ థాలీని ఆర్డర్ చేశాడు. అయితే.. సిబ్బందిలో ఒకరు పొరబాటున మాంసాహారాన్ని వడ్డించారు. కాసేపటికి అది నాన్ వెజ్ అని గుర్తించాడు. తనకు మాంసాహారాన్ని వడ్డించాడని వెయిటర్‌పై దాడికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును పలువురు నెటిజన్లు తప్పుబట్టారు.
”తప్పు జరిగింది. కానీ, అలా దాడికి దిగడం ఆమోదయోగ్యం కాదు”.. ”ఆహారం విషయంలో సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సింది”.. ”ఏది ఏమైనప్పటికీ ఆ ప్రయాణికుడు చేసింది తప్పే” అంటూ కామెంట్లు పోస్టు చేశారు. ఈ ఘటనపై తూర్పు రైల్వేశాఖ స్పందించింది. ”పొరబాటు జరిగింది. సమస్యను పరిష్కరించాం” అని ప్రకటనలో పేర్కొంది.