ఏపీ వాసుల మెట్రో కల నెరవరబోతోందా?.. ఇదిగో లేటెస్ట్ అప్‌డేట్

www.mannamweb.com


ఏపీ వాసుల మెట్రో కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దానికి అనుగుణంగానే ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రులు.. మెట్రో ప్రాజెక్ట్‌లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు.

తాజాగా.. కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సమావేశమయ్యారు ఏపీ మున్సిపల్‌ మంత్రి నారాయణ. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులపై ఇరువురు మధ్య కీలక చర్చ జరగ్గా.. ఏపీ మెట్రో ప్రాజెక్టులను త్వరగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్రమంత్రి ఖట్టర్‌కు విజ్ఞప్తి చేశారు మంత్రి నారాయణ. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్ట్‌లకు సంబంధించి.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని.. వీటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. విజయవాడ మెట్రోను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లారు మంత్రి నారాయణ.

అలాగే.. అమృత్-2 పథకం గత ఐదేళ్లుగా ఏపీలో అమలుకు నోచుకోలేదని.. ఆ పథకాన్ని మళ్లీ అమలు చేసేందుకు ఉన్న అవకాశాలు, తీసుకోవాల్సిన చర్యలపైనా ఖట్టర్‌తో చర్చించారు. ఆయా ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి ఖట్టర్.. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు గురించి ప్రధాని మోదీతో చర్చించి.. నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు మంత్రి నారాయణ. ఇక.. గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న ఏపీ మంత్రుల బృందం.. వివిధ శాఖల కేంద్రమంత్రులతోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. ఏపీకి రావాల్సిన నిధులపై వారితో చర్చించారు. ప్రధానంగా.. ఢిల్లీ టూర్‌లో అమరావతి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే.. అమరావతి నిర్మాణానికి రుణంతోపాటు ఏపీ మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు, మెట్రో ప్రాజెక్టులపై చర్చించారు ఏపీ మంత్రులు.