పాలు పెట్టి మనం ఏదో ఒక పనిలో నిమగ్నమై పోతాం. ఒక్కోసారి చిన్న మంట మీద పెట్టినా సరే పాలు అనేవి పొంగిపోయి స్టవ్ మొత్తం పాడైపోతుంది. మళ్లీ శుభ్రం చేయాల్సి ఉంటుంది.
చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు. పాలు కాచేటప్పుడు మనిషి దగ్గర ఉండాల్సి వస్తుంది.
టీ, కాఫీల విషయంలో కూడా అలాగే అవుతుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మరిగి పొంగిపోతాయి. ఇలా తరచుగా పొంగిపోతూ ఉంటే మాత్రం కాస్త చికాకుగా అనిపిస్తుంది. అందుకే పాలు మరిగేటప్పుడు ఈ సారి ఈ చిట్కాలు ట్రై చేయండి.
పాలు మరిగించేటప్పుడు ఎప్పుడైనా సరే పెద్ద గిన్నె తీసుకోండి. పెద్ద గిన్నెలో పాలు పొంగించడం వలన పైన ప్లేస్ ఉంటుంది కాబట్టి.. బయటకు పొంగకుండా ఉంటాయి. పాలు, స్టవ్ కూడా పాడవకుండా ఉంటాయి.
పాలు పొంగకుండా ఉండాలంటే.. పాలు మరుగుతున్నప్పుడు ఆ గిన్నెపై ఒక చెక్క గరిటెను అడ్డంగా పెట్టాలి. ఈ గరిటె వలన పాలు పొంగకుండా ఉంటాయి. పాలు లోపలే మరుగుతూ ఉంటాయి.
పాలు పైకి పొంగకుండా ఉండాలంటే.. పాలను మరిగించే ముందు గిన్నెలో నెయ్యి లేదా వెన్నను వేయాలి. నెయ్యి లేదా వెన్న వేయడం వల్ల పాలు మృదువుగా మారి.. దీంతో పాలు ఎంత మరిగినా పైకి పొంగకుండా ఉంటాయి.