ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉపాధ్యాయుల తలనొప్పి నుంచి తప్పించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అత్యంత క్లిష్టమైన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేశ్ ఉపాధ్యాయ బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకురావడం ద్వారా ఆ వర్గంలో ప్రశంసలు అందుకుంటున్నారు.
అత్యంత బలమైన ఉపాధ్యాయ సంఘాలను మేనేజ్ చేయడమంటే కాకలు తీరిన నాయకులకు కూడా తేలికకాదంటారు. అలాంటిది కేవలం పది నెలల్లోనే ఉపాధ్యాయ వర్గాలకు దగ్గరయ్యేలా మంత్రి నారా లోకేశ్ వ్యవహరించడం చర్చకు తావిస్తోంది.
రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు ఎంతటి ప్రభావం చూపిస్తాయో గతంలోనే అనేక సందర్భాల్లో వెల్లడైంది. ప్రధానంగా ఉపాధ్యాయులతో ఘర్షణాత్మక వైఖరి ప్రదర్శించడం వల్లే గత ప్రభుత్వం ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుందనే విశ్లేషణలు ఉన్నాయి. తమ హక్కులు విషయంలో రాజీ లేని పోరాటం చేసే ఉపాధ్యాయులను మేనేజ్ చేయడమంటే కత్తిమీద సాము కింద భావిస్తారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అతి ఎక్కువ మంది ఉపాధ్యాయులే.
ప్రజలను ప్రభావితం చేయగల శక్తి కూడా టీచర్లకు ఉంటుందని చెబుతారు. దీంతో ఏ ప్రభుత్వమైనా ఉపాధ్యాయుల విషయంలో అత్యంత సున్నితంగా వ్యవహరిస్తుంది. ఇదే విషయాన్ని పసిగట్టిన మంత్రి లోకేశ్ టీచర్లను మరింత మంచి చేసుకునే వ్యూహం రూపొందించారు. ఇందుకోసం ఉపాధ్యాయులు అత్యంత పారదర్శకంగా ఉండాలని కోరుకునే బదిలీలపై ఏకంగా ప్రత్యేక చట్టం తీసుకువచ్చారు.
తొలిసారిగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధ్యాయుల బదిలీ చట్టంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏటా నిర్వహించే ఉపాధ్యాయ బదిలీలు అనేక వివాదాలకు దారితీస్తుంటాయి. ప్రభుత్వంపై పలు విమర్శలకు దారితీస్తుంటాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం బదిలీల చట్టం చేయాలని భావించింది. ప్రధానంగా విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ ఈ అంశాన్ని సవాలుగా తీసుకున్నారని చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం ఇకపై ఏటా వేసవి సెలవుల్లో మాత్రమే బదిలీలు ఉంటాయి. సీనియార్టీ, పనిచేస్తున్న ప్రదేశం ఇలా కొన్ని ప్రాధాన్యాంశాలు తీసుకుని బదిలీలు నిర్వహిస్తారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనే విషయం కూడా చట్టం ద్వారా ముందే చెప్పాల్సివుండటంతో అనవసర వివాదాలు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నాదని అంటున్నారు. దీనిద్వారా విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ పెద్ద తలనొప్పి వదిలించుకున్నట్లైందని టాక్ వినిపిస్తోంది.