‘జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది’ – బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్

www.mannamweb.com


చిన్న పిల్లలకు అందించే చిక్కీల్లో సైతం డబ్బులు ఎగ్గొట్టిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్న జగన్ విమర్శలపై ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.6,500 కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిలను తీర్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడింది వైసీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. ‘అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లింది. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో రూ.3500 కోట్లు బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాక లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

నా యువగళం పాదయాత్రలోనే మీ నిర్వాకాన్ని విద్యార్థులు నా దృష్టికి తెచ్చారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సమస్య పరిష్కరించాం. గత ప్రభుత్వ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సర్టిఫికెట్లను తక్షణమే అందజేయాల్సిందిగా కళాశాలలను ఆదేశించాం. ఇకపై ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును నేరుగా కళాశాలలకు చెల్లించేలా ఇటీవలే నిర్ణయం కూడా తీసుకున్నాం.’ అని మంత్రి పేర్కొన్నారు.

‘విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు’

‘గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మీ అనాలోచిత, అవినీతి విధానాల కారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లల్లో 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన విషయం వాస్తవం కాదా?. ఉపాధ్యాయులు, విద్యార్థులను సిద్ధం చెయ్యకుండానే సీబీఎస్ఈ పరీక్షా విధానం తీసుకొచ్చారు. నీ నిర్ణయాలు బ్లైండ్గా ఫాలో అయితే ఆ పిల్లలంతా బోర్డు పరీక్షల్లో తప్పి డిప్రెషన్లోకి వెళ్లేవారు. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం పెంచకుండా, టోఫెల్, ఐబీ శిక్షణ ఇచ్చేవారు లేకపోయినా అమలు చేశామని డబ్బా కొట్టుకోవడం. ఇలా ఒక్కటేంటి విద్యా వ్యవస్థను నాశనం చేసిన పాపం మీదే.’ అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పబ్లిసిటీ పీక్ – విషయం వీక్

నాడు – నేడు అంటూ పబ్లిసిటీ పీక్కు తీసుకెళ్లారు కానీ విషయం వీక్ అని తేలిందని లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో పాఠశాలల్లో బల్లలు, తాగునీరు, టాయిలెట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని ధ్వజమెత్తారు. తన క్షేత్రస్థాయి పర్యటనల్లో ఈ విషయం స్పష్టమైందని చెప్పారు. ఇక ట్యాబులు ఇంటికి ఇవ్వడం వల్ల జరుగుతున్న అనర్థాలను మీరు నేరుగా తల్లిదండ్రులనే అడిగి తెలుసుకోవచ్చని అన్నారు. ‘మీరు చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరి చేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులను మెగా డీఎస్సీతో భర్తీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి తీరుతాం. రాబోయే ఐదేళ్లలో ఏపీ విద్యా రంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పించింది. మీలాంటి మారీచులు ఎంత తప్పుడు ప్రచారం చేసినా విద్యా రంగ సంస్కరణల విషయంలో మా అడుగు ముందుకే!’ అని లోకేశ్ ట్విట్లో పేర్కొన్నారు.