విద్యార్థుల స్కీములకు జగన్ సర్కార్ భారీగా బకాయిలు… మంత్రి లోకేశ్ సంచలన నిర్ణయం
గత ప్రభుత్వం పాఠశాలల్లో చిన్నారులకు గుడ్లు, చిక్కీలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే అవి సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ భారీగా బకాయిలు పెట్టింది.
దీంతో గుంటూరులో ఓ పాఠశాలకు కాంట్రాక్టర్లు గుడ్లు సరఫరా నిలివేశారు. ఈ విషయం నారా లోకేశ్ దృష్టికి రావడంతో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజనం, ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాలపైనా ఆరా తీశారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారులకు గుడ్లు, చిక్కీలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం రూ. 178.5 కోట్లు బకాయిలు చెల్లించాలని లోకేశ్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. అటు ఫీజు రీఎంబర్ మెంట్ పథకానికీ నిధులు సరిగా చెల్లించలేదని తెలిపారు. దీంతో కాలేజీ నుంచి తమ సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విద్యా దీవెన , వసతి దీవెన కింద రూ. 3,480 కోట్లు బకాయిలు ఉండటంతో డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని కాలేజీల యాజమాన్యం విద్యార్థులకు సూచించినట్లు పేర్కొన్నారు. దీంతో నారా లోకేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కాలేజీల యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థుల సర్టిఫికెట్లను ఇప్పించే ప్రయత్నం చేయాలని అధికారులను లోకేశ్ ఆదేశించారు. అలాగే పాఠశాల చిన్నారుకు సరఫరా చేస్తున్న గుడ్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్టర్లు సహకరించాలని, రావాల్సిన బకాయిలన్నీ త్వరలో చెల్లిస్తామని చెప్పారు. గుడ్లు, చిక్కీలను యథావిథిగా సరఫరా చేయాలని, ఏ పాఠశాలకూ నిలిపివేయొద్దని కాంట్రాక్టర్లను నారా లోకేశ్ ఆదేశించారు.