MrBeast: అత్యధిక సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబ్‌ ఛానల్‌గా మిస్టర్‌బీస్ట్‌

ప్రపంచంలోనే అత్యధిక మంది సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబ్‌ ఛానల్‌గా మిస్టర్‌బీస్ట్‌ (MrBeast) నిలిచింది. భారత మ్యూజిక్‌ కంపెనీ ‘టీ-సిరీస్‌’ను (T-Series) వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని మిస్టర్‌బీస్ట్‌ ఛానల్‌ను నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన జేమ్స్‌ స్టీఫెన్‌ డోనాల్డ్‌సన్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.


మిస్టర్‌బీస్ట్‌కు (MrBeast) 26.6 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. టీ-సిరీస్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య దానికంటే 1,608 తక్కువ. ఈ సంఖ్యలను పోలుస్తూ మిస్టర్‌బీస్ట్‌ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌కు కొన్ని గంటల వ్యవధిలోనే 12 మిలియన్ల వ్యూస్‌, 10 వేల లైక్‌లు రావడం గమనార్హం. బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ సైతం ఆయన్ని అభినందిస్తూ పోస్ట్‌ చేశారు. 2024 ఏప్రిల్‌లో మిస్టర్‌బీస్ట్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 25 కోట్లు దాటింది. దీంతో యూట్యూబ్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఛానల్‌గా నిలిచింది.

2019 నుంచి టీ-సిరీస్‌ అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్‌గా కొనసాగింది. స్వీడన్‌కు చెందిన ‘ప్యూడైపై’ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది. 2023లో ఓసారి ప్యూడైపైకు మిస్టర్‌బీస్ట్‌ మద్దతుగా నిలిచారు. తాజాగా టీ-సిరీస్‌ను ఆయన ఛానల్‌ దాటేయటంతో ప్యూడైపై ప్రతీకారం తాను తీర్చుకున్నానంటూ పోస్ట్‌ చేశారు.

2023లో అత్యధికంగా డబ్బు సంపాదించిన యూట్యూబ్‌ ఛానల్‌గా మిస్టర్‌బీస్ట్‌ (MrBeast) నిలిచింది. సాహసాలూ, వింత స్టంట్లూ చేస్తూ డోనాల్డ్‌సన్‌ నడుపుతున్న ఈ ఛానల్‌ ఆదాయం దాదాపు రూ.680 కోట్లని అంచనా.