ఏపీలో అధికార దుర్వినియోగం.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ విసుర్లు

www.mannamweb.com


ఏపీలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు, నాయకులతో జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యమని చెప్పారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాలని అన్నారు. అప్పుడే ప్రజల ఆశీస్సులు ఉంటాయని వైఎస్ జగన్ చెప్పారు.

రాజకీయాల్లో విశ్వాసనీయత చాలా ముఖ్యమని అన్నారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీను నెరవేర్చిందని తెలిపారు. సాకులు వెతకకుండా మేనిఫెస్టోను అమలు చేశామని అన్నారు. ఎప్పుడూ చూడని కోవిడ్ లాంటి సంక్షోభాన్ని రెండేళ్లపాటు ఎదుర్కొన్నామని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గాయని, ఖర్చులు పెరిగాయని వైఎస్ జగన్ చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఏపీలో వచ్చినా ఎక్కడా వెనకడుగు వేయలేదని వైఎస్ జగన్ అన్నారు.

ఈ కారణాలు చెప్పి, మేనిఫెస్టో అమలును వాయిదా వేయొచ్చని చాలామంది సలహా ఇచ్చారని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు తమ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. ఇలా చేయడం వల్ల 30 ఏళ్లపాటు తన బాటను నిర్దేశించేలా చేసిందని తెలిపారు. అందుకనే మాట తప్పకుండా హామీలు నెరవేర్చానని స్పష్టం చేశారు. తాను సమస్యలు, సాకులు చెప్పి తప్పించుకోలేదని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా బడ్జెట్‌కు ముందే సంక్షేమ క్యాలెండర్‌ విడుదల చేశామని తెలిపారు. అలాంటి పాలనను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. ఏపీ చరిత్రలో, దేశచరిత్రలో లేని విధంగా బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని అన్నారు. ఈ ప్రభుత్వం ఇంకా ఓటాన్‌ అక్కౌంట్‌తో నడుస్తోందని జగన్ విమర్శించారు.