PM Modi: మోదీ 3.Oకు ముహూర్తం ఫిక్స్‌.. జూన్‌ 8న ప్రమాణస్వీకారం..!

PM Modi: ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్‌ 8న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.


దిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ (PM Modi) సిద్ధమవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్‌ 8వ తేదీన సాయంత్రం దిల్లీలోని కర్తవ్యపథ్‌లో మోదీ ప్రమాణస్వీకార (Modi Oath Taking Ceremony) కార్యక్రమం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ వేడుకకు కూటమి నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం.

మంగళవారం నాటి ఫలితాల్లో ఎన్డీయే (NDA) కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్‌ చివరిసారిగా భేటీ అయి, ప్రస్తుత లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేసింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతల కీలక సమావేశం జరగనుంది. శుక్రవారం భాజపా, ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఎన్డీయే కొత్త ఎంపీలతో కలిసి మోదీ.. రాష్ట్రపతిని కలవనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో (Lok Sabha Election Results) భాజపా 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 99 స్థానాలతో కాంగ్రెస్‌ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 233 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ మార్కు (272)ను ఎన్డీయే దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.