Modi Cabinet: తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రుల ప్రస్థానమిది

www.mannamweb.com


తండ్రి దివంగత ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్‌నాయుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేసి, పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు.

కింజరాపు రామ్మోహన్‌నాయుడు

స్వస్థలం: నిమ్మాడ, కోటబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా

వయసు: 36 సంవత్సరాలు

విద్యార్హత: బీటెక్, ఎంబీఏ

తల్లిదండ్రులు: విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు

భార్య: శ్రావ్య

రాజకీయ నేపథ్యం: తండ్రి దివంగత ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్‌నాయుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేసి, పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో తెదేపా తరఫున తొలిసారి పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 2019లో వైకాపా గాలిలోనూ నిలిచి రెండోసారి ఎంపీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్‌ కొట్టారు.


పెమ్మసాని చంద్రశేఖర్‌

స్వస్థలం: బుర్రిపాలెం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా

వయసు: 47

విద్యార్హత: ఎంబీబీఎస్, ఎండీ (ఇంటర్నల్‌ మెడిసిన్‌)

తల్లిదండ్రులు: సువర్చల, పెమ్మసాని సాంబశివరావు

భార్య: డాక్టర్‌ శ్రీరత్న, కుమారుడు, కుమార్తె

అమెరికా వెళ్లి వైద్యవిద్యలో పీజీ చేశారు. అమెరికాలో లైసెన్సింగ్‌ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను స్థాపించి, దాన్ని వేల కోట్ల సంస్థగా తీర్చిదిద్దారు. తెదేపా ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనా చివర్లో అవకాశం చేజారింది. ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిత్వం దక్కించుకుని.. వైకాపా అభ్యర్థి కిలారి రోశయ్యపై భారీ మెజారిటీతో గెలిచారు.


భూపతిరాజు శ్రీనివాసవర్మ

స్వస్థలం: భీమవరం

వయసు: 59 సంవత్సరాలు

తల్లిదండ్రులు: సీతాలక్ష్మి, సూర్యనారాయణరాజు. తాత భూపతిరాజు బాపిరాజు స్వాతంత్ర సమరయోధులు

భార్య: వెంకటేశ్వరీదేవి

విద్యార్హత: ఎంఏ హిందీ, ఎంఏ (ఇంగ్లిష్‌), బీఎల్‌

వృత్తి: రొయ్య రైతు. స్థిరాస్తి వ్యాపారంలోనూ ఉన్నారు.

రాజకీయ నేపథ్యం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భాజపా కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా, జోనల్‌ ఇన్‌ఛార్జిగా, పార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా పని చేశారు. పార్టీ రాష్ట్ర  కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.


కిషన్‌రెడ్డిని రెండోసారి వరించిన కేంద్రమంత్రి పదవి

పేరు: గంగాపురం కిషన్‌రెడ్డి;  పుట్టిన తేదీ: 15.6.1960

తల్లిదండ్రులు: ఆండాళ్లమ్మ, స్వామిరెడ్డి;  భార్య: కావ్యారెడ్డి(గృహిణి)

పిల్లలు: వైష్ణవి, తన్మయ్‌(ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు)

కఠోర శ్రమ, అంకితభావం, పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనేందుకు నిలువెత్తు నిదర్శనం గంగాపురం కిషన్‌రెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు ఎంపీగా గెలిచి.. అందరివాడిగా పేరుతెచ్చుకున్న కిషన్‌రెడ్డిని మరోసారి కేంద్రమంత్రి పదవి వరించింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. అవినీతి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ స్ఫూర్తితో బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృష్ణానది నుంచి గోదావరి నది వరకూ ‘తెలంగాణ పోరుయాత్ర’ నిర్వహించి 333 సమావేశాల్లో ప్రసంగించారు. 1977లో జనతాపార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2004లో తొలిసారి హిమాయత్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 మే నుంచి 2021 జులై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా 2021 జులై నుంచి కేంద్ర సాంస్కృతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.


కార్యకర్త నుంచి కేంద్ర సహాయ మంత్రి దాకా…

పేరు: బండి సంజయ్‌కుమార్‌

పుట్టిన తేదీ: 11-7-1971

తల్లిదండ్రులు: శకుంతల, బండి నర్సయ్య

భార్య: బండి అపర్ణ (ఎస్‌బీఐ ఉద్యోగి)

పిల్లలు: సాయిభగీరథ్, సాయి సుముఖ్‌

కరీంనగర్‌ నుంచి దిల్లీ దాకా ఎదిగిన నేతగా బండి సంజయ్‌ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. బండి సంజయ్‌ స్వస్థలం కరీంనగర్‌. విద్యార్థి దశ నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో స్వయం సేవకుడిగా పని చేస్తూ ఏబీవీపీ పట్టణ కన్వీనర్‌గా, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగారు. తరువాత భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. ఆడ్వాణీ రథయాత్రలో ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. 2019లో తొలిసారిగా కరీంనగర్‌ నుంచి ఎంపీగా గెలిచారు. తరువాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం భాజపాలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచారు. కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు.