పర్సనల్ సెక్రటరీ పని అంటే చాలా కష్టమైనది. బాస్ ఏమి చెబుతున్నారో సరిగ్గా అర్థం చేసుకోవడం, దానికి అనుగుణంగా ప్లాన్ చేయడం, సూచనలు ఇవ్వడం – ఇదంతా చాలా శ్రమతో కూడిన పని. కొంచెం ఒత్తిడి తప్పినా, పని తప్పు అవుతుంది.
ఇలాంటి బాధ్యతలు ఉన్న బాస్ ఒకవేళ ప్రధానమంత్రి అయితే? అప్పుడు ఒత్తిడి ఎంత ఉంటుంది! అలాంటి గురుతర బాధ్యతను స్వీకరించిన వ్యక్తి నిధి తివారీ. ఆమె పేరుకు తగినట్లుగా ఒక జ్ఞాన నిధి. ఆమె జీవితమే అనేకమందికి ప్రేరణ. ఐఎఫ్ఎస్ అధికారిణిగా తన వృత్తిని ప్రారంభించిన నిధి, వారణాసి నుండి ప్రధానమంత్రి కార్యాలయం వరకు అనేక స్థాయిల్లో పనిచేసి ఈ స్థాయికి చేరుకుంది.
ప్రధానమంత్రి రోజువారీ కార్యక్రమాలను ప్లాన్ చేయడం ఒక సాధారణ విషయం కాదు. వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు ప్రతిరోజు ఎందరో సమావేశాలకు వస్తుంటారు. వారి అవసరాలు, సమస్యలు, ప్రతిపాదనలు – ఇవన్నీ ప్రధానమంత్రికి సరిగ్గా అందించాలి. అన్నింటినీ సమన్వయం చేస్తూ, ప్రధాని ప్రాధాన్యతలను గమనిస్తూ, పీఎం షెడ్యూల్ డిజైన్ చేయడం ఒక పెద్ద సవాలు.
2022 నవంబర్ నుండి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసిన నిధి, ఇప్పుడు ప్రధాన వ్యక్తిగత కార్యదర్శిగా ప్రమోషన్ పొందింది. వారణాసిలోని మెహమూర్గంజ్లో పుట్టి పెరిగిన ఆమె, బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందారు. అక్కడే తన భర్త సుశీల్ జైస్వాల్ని కలిశారు. 2006లో వివాహం జరిగింది.
సివిల్ సర్వీసెస్లో చేరి దేశానికి సేవ చేయాలనేది ఆమె చిన్ననాటి లక్ష్యం. వివాహం తర్వాత కూడా ఆమె తన ప్రయత్నాలను కొనసాగించి, వారణాసి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వాత 2013లో UPSC సివిల్ సర్వీసెస్లో 96వ ర్యాంక్ సాధించారు. ఐఎఫ్ఎస్గా శిక్షణ పొందుతున్న సమయంలోనే, ఆమె ప్రతిభకు గుర్తింపుగా అంబాసిడర్ విమల్ సన్యాల్ స్మారక పతకం అందుకున్నారు.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, 11 సంవత్సరాలలో వివేక్ కుమార్, హార్దిక్ సతీష్, చంద్ర షా వంటి వ్యక్తులు ఈ బాధ్యతను నిర్వహించారు. ఇప్పుడు ఈ స్థానంలో నిధి తివారీ మొదటి మహిళగా నియమితులయ్యారు. ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా ఆమెకు నెలకు 1.44 లక్షల జీతం మరియు ఇతర సదుపాయాలు లభిస్తున్నాయి.
ప్రధానమంత్రి కార్యాలయంలోకి రాకముందు, ఆమె విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో అనేక కీలక అంశాలపై పనిచేశారు. 2023లో జీ20 శిఖరాగ్ర సమావేశం సమయంలో ఆమె చూపిన సామర్థ్యం, ప్రధానమంత్రికి ఆమెపై మరింత విశ్వాసాన్ని కలిగించింది.
టాలెంట్ ఉన్న వారికి ఎల్లప్పుడూ అవకాశాలు ఉంటాయి. స్త్రీల శక్తిని అడ్డుకునేవారు ఎవరూ లేరు. ఆకాశమే హద్దుగా ముందుకు సాగడానికి నిధి తివారీ జీవితం ఒక ఉదాహరణ. ఇప్పుడు అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.