45 గంటల పాటు మోడీ ‘ధ్యానం’.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అని కాంగ్రెస్ ఫిర్యాదు

ప్రధాని మోడీ కన్యాకుమారిలో స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర 45 గంటలు పాటు ధ్యానం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ధాన్య మండపం దగ్గర మెడిటేషన్ చేయనున్నారు.


కన్యాకుమారిలో మోడీ సందర్శన సందర్భంగా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భద్రత కోసం 2 వేల మంది పోలీసులు, భద్రతా ఏజెన్సీలు మోహరించారు. రాక్ మెమోరియల్, బోట్ జెట్టీ, హెలిప్యాడ్, ప్రభుత్వ అతిథి గృహం వద్ద భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. రెండ్రోజుల పాటు పర్యాటకులకు బీచ్ లోకి అనుమతి లేదని తెలిపారు. గురువారం నుంచి శనివారం వరకు బీచ్ లో ఆంక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బీచ్ లోకి ప్రైవేటు పడవలను అనుమతించబోమని పేర్కొన్నారు. ప్రధానికి చెందిన ప్రత్యేక భద్రతా బృందం కూడా ధ్యాన మండపం చేరుకుని భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసింది. హెలికాప్టర్ ల్యాండింగ్ పరీక్షలను కూడా జరిపింది.

మోడీ ‘ధ్యానం’లో ఉండనున్నట్టు ప్రకటించడంపై ఎన్నికల కమిషన్‌ కు కాంగ్రెస్ ఫిర్యాదుచేసింది. ఇదంతా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపింది. 48 గంటల సైలెన్స్ పీరియడ్‌లో ప్రత్యక్షం కానీ పరోక్షంగా కానీ ఎవరినీ ఎలాంటి ప్రచారానికి అనుమతించరాదని ఈసీకి తెలిపినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. మే 30వ తేదీ 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ వరకూ సైలెన్స్ పీరియడ్ ఉంటుందని పేర్కొన్నారు. మోడీ తనను తాను ప్రచారంలో ఉంచుకునేందుకు వేసిన ప్లాన్ ఇదని మండిపడ్డారు. జూన్ 1 సాయంత్రం తర్వాత ధ్యానం చేసుకునేలా ఆదేశించాలని ఈసీని కోరినట్లు వివరించారు. అలా కాకుండా మే 30 నుంచే దీక్ష చేస్తానంటే.. దానికి సంబంధించిన వార్తలు మీడియాలో టెలికాస్ట్ కాకుండా నిషేధించాలని కోరినట్లు అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు.