తక్కువ మొత్తాలతో ఎక్కువ రాబడి- టాప్ 10 ప్రభుత్వ పథకాలు ఇవే

Government Schemes For Financial Future : ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉండాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. అయితే అందరి ఆర్థిక లక్ష్యాలు ఒకేలా ఉండవు. బాలలు, యువత, మహిళలు, వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులు విభిన్నమైన ఆర్థిక లక్ష్యాలను కలిగి ఉంటారు. ఈ టార్గెట్లను నెరవేర్చేందుకు వేర్వేరు రకాల ప్రభుత్వ పొదుపు, పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి పన్నును ఆదా చేయడంతో పాటు ఆకర్షణీయమైన రాబడిని, వడ్డీ ఆదాయాన్ని ఆర్జించిపెడతాయి. 2025 సంవత్సరంలో ప్రతీ భారతీయుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన టాప్-10 ప్రభుత్వ పొదుపు, పెట్టుబడి పథకాలపై కథనమిది.


1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
మన దేశంలోని ఉద్యోగ, కార్మిక వర్గాల్లో చాలామంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లోనే పెట్టుబడి పెడుతుంటారు. దీనికి 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మనం పెట్టుబడి పెట్టే మొత్తాన్ని ఆ వ్యవధిలోగా పీపీఎఫ్ నుంచి వెనక్కి తీసుకోలేం. అయితే 5 సంవత్సరాల తర్వాత పాక్షికంగా మన పెట్టుబడిని విత్‌డ్రా చేసుకుంటే జరిమానాలు ఉండవు. 7 శాతం నుంచి 8 శాతం దాకా వడ్డీరేటును పీపీఎఫ్ చెల్లిస్తుంది. లాంగ్ టర్మ్‌ పెట్టుబడి సాధనంగా ఇది చాలా బెస్ట్. ఇందులోని పెట్టుబడులపై సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలనూ పొందొచ్చు.

నెలకు రూ.1000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది?
ఒకవేళ మనం పీపీఎఫ్‌లో ప్రతినెలా రూ.1000 పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో రూ.1.80 లక్షలు జమ అవుతాయి. దీనిపై 7.1 శాతం వడ్డీరేటు చొప్పున రూ.1.12 లక్షల రాబడి వస్తుంది. అసలు, వడ్డీ రాబడి కలుపుకొని మన చేతికి మొత్తం రూ.2.92 లక్షల దాకా అందుతాయి.

2. సుకన్య సమృద్ధి యోజన (SSY)
మీ కుమార్తె భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలని అనుకుంటున్నారా ? అయితే సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై – SSY)లో చేరండి. 10 ఏళ్లలోపు బాలికల పేరుపై మాత్రమే ఈ స్కీంలో పెట్టుబడి పెట్టొచ్చు. బాలిక ఉన్నత విద్య, వివాహ సమయానికి నిర్దిష్ట మొత్తాన్ని పొందాలని భావించే తల్లిదండ్రులు ఈ పథకంలో చేరొచ్చు. దీనిలో పెట్టే పెట్టుబడులపై ప్రస్తుతం 7.6 శాతం దాకా వడ్డీని చెల్లిస్తున్నారు. సెక్షన్ 80C కింద డిపాజిట్లు, విత్‌డ్రాలపై పన్ను ఆదాను సైతం పొందొచ్చు.

ప్రతినెలా కనీసం రూ.250
సుకన్య సమృద్ధి యోజన స్కీంలో ప్రతినెలా కనీసం రూ.250 చొప్పున కూడా జమ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరం వ్యవధిలో రూ.1.50 లక్షల దాకా డిపాజిట్ చేయొచ్చు.

3.అటల్ పెన్షన్ యోజన (APY)
రిటైర్మెంట్ సెక్యూరిటీని అందించే పెన్షన్ పథకం అటల్ పెన్షన్ యోజన (ఏపీవై – APY). ఇది అసంఘటిత రంగాలలో పనిచేసే వారి భవిష్యత్తును పదిలంగా మారుస్తుంది. ఇందుకోసం ప్రతినెలా కొంత మొత్తాన్ని ఈ పథకంలో డిపాజిట్ చేయాలి. దీనికి ప్రతిగా 60 ఏళ్ల వయసు తర్వాత కనీస నెలవారీ పెన్షన్ జీవితాంతం లభిస్తుంది. 60 ఏళ్ల వయసు వచ్చే వరకు మనం ప్రతినెలా డిపాజిట్ చేసే మొత్తం ఆధారంగా నెలవారీ పెన్షన్‌‌ను నిర్ణయిస్తారు. కనీస నెలవారీ పెన్షన్ రూ.1,000 నుంచి మొదలవుతుంది.

నెలకు రూ.42 చెల్లిస్తే, రూ.1000 పెన్షన్
ఉదాహరణకు 18 ఏళ్ల వయసు కలిగిన ఓ వ్యక్తి తనకు రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.1000 పెన్షన్ కావాలని భావిస్తే, అప్పటివరకు ప్రతినెలా రూ.42 చొప్పున చెల్లించాలి. ఇంతే నెలవారీ పెన్షన్ కోసం 40 ఏళ్ల వయస్కుడు ప్రతినెలా రూ.291 చొప్పున చెల్లించాలి.

4. జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS)
జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్‌పీఎస్ – NPS) అనేది చాలా ఆకర్షణీయమైన పెన్షన్ పథకం. దీని ద్వారా లభించే పదవీ విరమణ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో మనం చేసే డిపాజిట్లను ఈక్విటీలు (షేర్లు), డెట్ (రుణ) సాధనాలలో కేంద్ర ప్రభుత్వం మదుపు చేస్తుంది. దీనివల్ల ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టే వారికి దీర్ఘకాలంలో ఆకర్షణీయ రాబడులు అందుతాయి. మన పెట్టుబడిపై గరిష్ఠంగా 10 శాతం నుంచి 12 శాతం దాకా రాబడి లభిస్తుంది. ఎన్‌పీఎస్‌లో డబ్బులను డిపాజిట్ చేసినందుకు పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. అయితే ఈ పరిమితి రూ.2 లక్షలకు మించకూడదు. ఇంత మొత్తానికి సెక్షన్లు 80సీ, 80సీసీడీ(1బీ) కింద పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పదవీ విరమణ టైంలో పొదుపులో కొంత భాగాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని మన పెన్షన్ యాన్యుటీకి కోసం కేటాయిస్తారు. రిటైర్మెంట్ తర్వాత ప్రతినెలా పెన్షన్ ఇవ్వడానికి కేటాయించే నిధినే పెన్షన్ యాన్యుటీ అంటారు.

టైర్ 1, టైర్ 2 ఖాతాలు
టైర్ 1 రకం ఎన్‌పీఎస్ ఖాతా ద్వారా మనం ప్రతినెలా కనీసం రూ.500 చొప్పున డిపాజిట్ చేయొచ్చు. ఇందులో ఏడాదికి కనిష్ఠంగా రూ.1000 దాకా మదుపు చేసుకోవచ్చు. టైర్ 2 రకం ఎన్‌పీఎస్ ఖాతా ద్వారా ప్రతినెలా కనీసం రూ.250 చొప్పున డిపాజిట్ చేయొచ్చు. ఈ ఖాతా ద్వారా ఏడాదిలో కనిష్ఠంగా నిర్దిష్ట మొత్తాన్ని జమ చేయాలనే నిబంధన లేదు.

5. కిసాన్ వికాస్ పత్ర (KVP)
పెద్ద మొత్తాన్ని దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెట్టాలని భావించే వారికి బెస్ట్ ఆప్షన్ కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ – KVP). ఇందులో మనం ఒకేసారి పెట్టే పెట్టుబడిపై 10 ఏళ్లలో ఏకంగా 100 శాతం రాబడి వస్తుంది. స్థిరమైన రాబడి కోరుకునే వారు ఈ పథకంలో చేరొచ్చు. మన పెట్టుబడిపై కేవీపీ పథకం 7.5 శాతం వడ్డీ రాబడిని అందిస్తుంది. అయితే పన్ను ప్రయోజనాలు లభించవు. కిసాన్ వికాస్ పత్రలో డిపాజిట్ చేసే డబ్బులను కనీసం రెండున్నర సంవత్సరాల పాటు వెనక్కి తీసుకోలేం. ఆ తర్వాత వాటిని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో ఒకేసారి మనం కనిష్ఠంగా రూ.1000 కూడా డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించి గరిష్ఠంగా ఎంతవరకు డిపాజిట్ చేయొచ్చు అనే దానికి లిమిట్ లేదు.

6.మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC)
మహిళల కోసం రూపొందించిన ప్రత్యేక పెట్టుబడి పథకం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ (ఎంఎస్ఎస్‌సీ). ఇది 2 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధితో వస్తుంది. సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటుతో, మహిళలకు ఆకర్షణీయమైన రాబడిని అందిస్తుంది. ఈ పథకం ఆకర్షణీయమైన స్వల్పకాలిక పెట్టుబడి ఆప్షన్. మహిళలు తమ సంపదను పెంచుకోవడానికి ఈ స్కీం బెస్ట్. ఇందులో పెట్టుబడి పెట్టే డబ్బులను అవసరాలకు అనుగుణంగా పాక్షికంగా విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు.

ఎంత డిపాజిట్ చేయాలి ?
పోస్టాఫీసులు, ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ స్కీంకు అప్లై చేయొచ్చు. ఈ స్కీం నెలవారీ డిపాజిట్లకు అనుమతించదు. ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేయాలి. కనిష్ఠంగా రూ.1000, గరిష్ఠంగా రూ.2 లక్షలను ఈ స్కీంలో ఒకేసారి డిపాజిట్ చేయొచ్చు.

7. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS)
సురక్షితమైన స్థిరమైన నెలవారీ రాబడిని కోరుకునే వారు ‘పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం’లో చేరొచ్చు. ఈ పథకం దాదాపు 7.4 శాతం వడ్డీ రాబడిని అందిస్తుంది. దీనికి 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. అంటే అప్పటి వరకు మన పెట్టుబడి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోలేం. ఈ స్కీంలో మనం వ్యక్తిగతంగా గరిష్ఠంగా రూ.9 లక్షలు, మరొకరితో కలిసి జాయింట్‌గా రూ.15 లక్షల దాకా డిపాజిట్ చేయొచ్చు. పదవీ విరమణ తర్వాత స్థిరమైన నెలవారీ రాబడిని ఈ పథకం ద్వారా పొందొచ్చు.

8. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు అత్యంత లాభదాయకంగా ఉండే స్కీమ్ ‘సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్’. దీనిలో మదుపు చేసే డబ్బులపై 8.2 శాతం దాకా వడ్డీ రాబడి లభిస్తుంది. ఈ వడ్డీ రాబడిని ప్రతి 3 నెలలకు ఒకసారి లబ్ధిదారుడికి చెల్లిస్తారు. దీనివల్ల 60 ఏళ్లకు పైబడిన వారు తమ ఆర్థిక, వైద్య అవసరాలను తీర్చుకోవచ్చు. ప్రత్యేకించి పదవీ విరమణ చేసిన వారికి ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ స్కీంకు 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంది. మనం కావాలంటే ఈ లాక్-ఇన్ వ్యవధిని మరో 3 ఏళ్లు పెంచుకోవచ్చు. ఈ స్కీంలో పెట్టే పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఈ పథకం కింద సంపాదించే వడ్డీ రాబడిపై పన్ను విధిస్తారు.

9. ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY)
సీనియర్ సిటిజన్లకు నెలవారీ పెన్షన్ అందించే చక్కటి పథకం ‘ప్రధాన మంత్రి వయ వందన యోజన’. ఈ స్కీంను ఎల్‌ఐసీ సంస్థ అందిస్తోంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్లు దీనితో లబ్ధి పొందొచ్చు. ఈ స్కీంలో చేరే వారు ప్రతినెలా లేదా త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ అందుకోవచ్చు. వీటిలో మన అవసరాలకు అనుగుణమైన ఏదైనా ఒక ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ పథకంలో పెట్టే పెట్టుబడిపై 7.4 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది. దీనిలో కనీస పెట్టుబడి మొత్తం రూ.15 లక్షలు.

10.లాడ్లీ లక్ష్మీ యోజన
బాలికల విద్య, వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు లాడ్లీ లక్ష్మీ యోజనను మధ్యప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. దీని ద్వారా బాలికలకు నిర్దిష్ట కాల వ్యవధిలో ఆర్థిక సహాయం అందుతుంది. ఈ స్కీంకు రాష్ట్ర ప్రభుత్వం తనవంతు విరాళాలను చెల్లిస్తుంది. దీనివల్ల కుటుంబాలు తమ కుమార్తెల కోసం దీర్ఘకాలంలో నిర్దిష్ట ఆర్థిక నిధిని నిర్మించుకోగలుగుతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.