ఏపీలో మందుబాబులకు మరింత కిక్

 ఏపీలో( Andhra Pradesh) మరో మద్యం పాలసీ అమల్లోకి రానుంది. కొత్త బార్ల పాలసీ పై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈనెల 30తో బార్ల పాలసీ ముగియనుంది.


దీంతో కొత్త పాలసీపై ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్. ఏపీలో మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. కొత్త లిక్కర్ పాలసీ అమలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. అదే సమయంలో మందు బాబులకు బ్రాండెడ్ మద్యం దొరుకుతుంది. 99 రూపాయలకే క్వార్టర్ మద్యం సైతం అందిస్తున్నారు. తక్కువ ధరకు మద్యం దొరుకుతుండడంతో అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. మరోవైపు మద్యం షాపుల వద్ద మందుబాబులు మద్యం తాగే విధంగా పర్మిట్ రూములు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే బార్ల పాలసీ ముగియడంతో.. కొత్త పాలసీ రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

లాటరీ విధానంలోనే బార్లు..
మద్యం షాపులను( liquor shops ) ప్రైవేటు వ్యక్తులకు లాటరీ విధానంలో కేటాయించడం ద్వారా ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. దరఖాస్తు రూపంలోనే దాదాపు వేల కోట్ల రూపాయలు అప్పట్లో సమకూరింది. అందుకే మద్యం షాపుల తరహాలోనే బార్లకు కూడా లాటరీ విధానంలో లైసెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. జగన్ హయాంలో వేలం విధానంలో బార్లకు లైసెన్సులు కేటాయించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా లైసెన్సులు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లైసెన్సు ఫీజుల విషయంలో రెండు రకాల ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఈనెల 30తో జగన్ ప్రభుత్వం రూపొందించిన బార్ల పాలసీ గడువు ముగియనుంది. అందుకే అంతకంటే ముందే బార్ల పాలసీని ప్రవేశపెట్టి అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొద్ది రోజుల్లో పాలసీని ప్రకటించనుంది. ఈ పాలసీ ప్రకారమే సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్లు అందుబాటులోకి తేనుంది.

రెండు రకాలుగా ప్రతిపాదనలు..
మొదటి ప్రతిపాదనకు సంబంధించి..
నగర పంచాయతీ బార్లకు రూ.35 లక్షలు, మున్సిపాలిటీల్లో బార్లకు రూ.40 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బార్లకు రూ.45 లక్షలు లైసెన్స్ ఫీజులుగా పెట్టాలన్నది మొదటి ప్రతిపాదనగా తెలుస్తోంది. ఇక రెండో ప్రతిపాదనకు సంబంధించి నగర పంచాయతీల్లోని బార్లకు రూ.55 లక్షలు, మున్సిపాలిటీలోని బార్లకు రూ.65 లక్షలు, కార్పొరేషన్లలోని బార్లకు రూ.75 లక్షలుగా నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి ప్రతిపాదన వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గుముఖం పడుతుంది. అందుకే దానిని అధిగమించేందుకు బార్ల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లు ఉన్నాయి. వీటి సంఖ్యను వెయ్యికి పెంచాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రెండో ప్రతిపాదన ప్రకారం ఫీజులు ఎక్కువగా ఉంటే బార్ల సంఖ్య యధావిధిగా కొనసాగుతుంది. అయితే ఫీజులు తగ్గించి బార్ల సంఖ్య పెంచడానికి ఎక్కువగా ఉందని సమాచారం.

పర్మిట్ రూములు సైతం..
బార్ల పాలసీ( bar policy ) ప్రకటిస్తున్న నేపథ్యంలో.. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములకు సైతం అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా బార్లలో మద్యం తాగేందుకు అనుమతి ఉంటుంది. అయితే మద్యం దుకాణాలతో పోల్చితే అక్కడ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. మందుబాబులు తీరిగ్గా మద్యం తాగేందుకు బార్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇప్పుడు మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములకు అనుమతిస్తే ఆ ప్రభావం బార్లపై పడుతుంది. అందుకే పర్మిట్ రూములు ఇవ్వొద్దా? ఇవ్వాలా అన్నదానిపై ప్రభుత్వం చాలా రకాల ఆలోచనలు చేసింది. అయితే కొన్ని రకాలైన నిబంధనలను తెరపైకి తెచ్చి పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మందుబాబులకు పండగే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.