Mornging shlokam: ఉదయం నిద్ర లేవగానే మనం ఏం చేస్తామో దాని ప్రభావం రోజంతా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకే నిద్ర లేవగానే దేవుడి చిత్రపటం లేదా తమ ప్రియమైన వారి ఫోటోలను చూసుకుంటారు.
అయితే పొద్దున్నే లేవగానే ఏం చేయాలి అనే దాని గురించి పెద్దలకు చిన్న పిల్లలకు తప్పనిసరిగా బోధించాలి. తెల్లవారుజామున నిద్రలేవగానే ఈ శక్తివంతమైన శ్లోకాన్ని చదువుకుంటూ అరచేతులు రుద్దుకుని నమస్కరించుకోవడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు.
కరాగ్రే వసతే లక్ష్మీః కర్మధ్యే సరస్వతి |
కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనమ్ ॥
ఈ చిన్న శ్లోకం మిమ్మల్ని చాలా శక్తివంతంగా చేస్తుందని, సానుకూల ఆలోచనలు కలిగేలా చేస్తుందని పెద్దలు చెబుతారు.
కరాగ్రే వసతే లక్ష్మీః
ఈ పదాలకు అర్థం చేతుల్లోని కొనవేళ్ళపై మహాలక్ష్మి నివసిస్తుందని అంటారు. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సును ఇచ్చే దేవత. మన వేళ్లు మనకు సంపద, విజయాన్ని అందిస్తాయి. చేతులతో శ్రేయస్సును సృష్టించే శక్తి మనకు మాత్రమే ఉందని ఇది గుర్తు చేస్తుంది. జీవితంలో చేసే ప్రతి పని చేతులతోనే జరుగుతుంది. అందుకే సంపదకు అది దేవత అయిన లక్ష్మీదేవి మన చేతిపై కూర్చుంటుందని అంటారు. కళ్ళు తెరవగానే చేతులను చూసుకోవడం సానుకూలంగా ఆలోచించేలా చేస్తుందని చెబుతారు.
కర్మధ్యే సరస్వతి
వేళ్లను చూసుకున్న తర్వాత అరచేతిని చూసుకోవాలి. అరచేతుల్లో సరస్వతి మాత కొలువై ఉంటుందని నమ్ముతారు. జ్ఞానం, సృజనాత్మకత, అభ్యాసానికి దేవతమన చేతిలో ఉందని ఇది చెప్తుంది. సాధారణంగా పుస్తకం పట్టుకునేటప్పుడు అరచేతల మధ్యలోనే పుస్తకాలు పెట్టుకుంటారు. అంటే సరస్వతీదేవి మన అరచేతుల్లో ఉంటుందని స్పష్టంగా తెలియజేస్తుంది. మన లక్ష్యాలను చేరుకోవడంలో విద్య ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జ్ఞానం మనల్ని ఉన్నత స్థానాలకు నిలబెడుతుంది. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి దేవిని నమస్కరిస్తూ అరచేతులను చూసుకోవాలి.
కరమూలే తు గోవిందః
చేతుల మూలభాగంలో గోవిందుడు అంటే విష్ణుమూర్తి కొలువై ఉన్నాడని నమ్ముతారు. విశ్వంలోని శక్తులను సమతుల్యంగా ఉంచే దైవిక శక్తి విష్ణుమూర్తికి ఉంది. మన చుట్టూ ఉన్న శక్తులను సమతుల్యం చేసే శక్తి మన చేతులకే ఉందని దీని అర్థం. అంటే మనం చేసే ఏ పని నుంచైనా అది తప్పు ఒప్పు అనేది మన మీద ఆధారపడుతుంది.
ప్రభాతే కరదర్శనం
నిద్ర లేవగానే చేతులను చూడమని ఈ శ్లోకం చెబుతోంది. లక్ష్మీదేవి, సరస్వతీ, విష్ణుమూర్తి మన చేతుల్లో నివసిస్తున్నారని ఈ మంత్రం అర్థం. జ్ఞానం, సమృద్ధి లేక మనం చేసే పనులు తప్పొప్పుల గురించి మొత్తం మన చేతిలోనే ఉంటుంది. దీని అర్థం చేతిలో పుస్తకాలను పట్టుకోగలవు అవసరమైతే తుపాకీని పట్టుకోగలవు అది మనం ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మన భవిష్యత్తుని మన చేతులే నిర్ణయిస్తాయి. అటువంటి చేతుల్లో ముగ్గురు కొలువై ఉన్నారని గుర్తు చేసుకుంటూ వారికి నమస్కరించుకుంటూ సానుకూల దృక్పథంలో ముందుకు సాగాలని కోరుకుంటూ చేతులను నమస్కరించుకుంటారు.
ఈ ఉదయ మంత్రం చాలా శక్తివంతమైనది. మూడు ముఖ్యమైన మానవ అవసరాలను మిళితం చేస్తుంది. సంపద, జ్ఞానం, సమతుల్యతను కాపాడే ఈ మంత్రంలోనే అన్ని ఉన్నాయి మన చేతిలో శ్రేయస్సును తీసుకురావడానికి జ్ఞానాన్ని పొందేందుకు జీవితంలో శ్రమతో కాపాడుకునే శక్తిని కలిగి ఉన్నాయని ఇది బోధిస్తుంది. లక్ష్మీదేవి సరస్వతి విష్ణువును కలిసి ప్రార్ధించడం ద్వారా ఉదయం సానుకూల శక్తితో ముందడుగు వేస్తారు.