AIతో దోమల నిర్మూలన-6 కార్పోరేషన్లలో ఏపీ సర్కార్ కొత్త పథకం.

పీలో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక స్మార్ట్ వ్యవస్థల మంత్రం జపిస్తున్న కూటమి సర్కార్ ఇప్పుడు దోమల నిర్మూలనకు సైతం ఈ వ్యవస్థలను వాడుకునేందుకు సిద్ధమైంది.


ఇందులో భాగంగా కొత్తగా ఏఐ ఆధారితంగా పనిచేసే స్మార్ట్ దోమల నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. దీన్ని తొలుత ఆరు కార్పోరేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తారు.

వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణ కోసం డీప్ టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్ దోమల నియంత్రణ’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. కృత్రిమ మేధస్సు శక్తితో పనిచేసే స్మార్ట్ దోమల నిఘా వ్యవస్థ (SMoSS) రాష్ట్రంలోని ఆరు ప్రధాన మునిసిపల్ కార్పొరేషన్లలోని 66 ప్రాంతాల్లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించనుంది.

SMoSS ప్రధానంగా దోమల బెడదను అరికట్టడం ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతుందని, దీంతో పురపాలక సిబ్బంది పని భారం తగ్గుతుందని, పట్టణ స్థానిక సంస్థల వ్యయాలను కూడా తగ్గించచ్చని ప్రభుత్వం చెబుతోంది. డ్రోన్లు, సెన్సార్లు, హీట్ మ్యాప్స్ , ట్రాప్స్ వంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాధనాల సహాయంతో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తామని వెల్లడించింది.

గ్రేటర్ విశాఖలోని 16 ప్రాంతాల్లో, కాకినాడలో 4, రాజమండ్రిలో 5, విజయవాడలో 28, నెల్లూరులో 7, కర్నూలులోని 6 ప్రాంతాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభిస్తారు.

దీని సామర్థ్యాన్ని అంచనా వేయడానికి తాజాగా ఓ ప్రైవేట్ ఏజెన్సీ అభివృద్ధి చేసిన ఏఐ శక్తితో కూడిన SMoSS గురించి అధ్యయనం చేసింది. పైలట్ ప్రాజెక్ట్ భాగంగా ఎంపిక చేసిన పట్టణ స్థానిక సంస్థల్లో ప్రధానంగా దోమలు ఎక్కువ గా ఉండే ప్రాంతాల్లో AI శక్తితో కూడిన స్మార్ట్ దోమల సెన్సార్లు ఏర్పాటు చేస్తారు. ఈ స్మార్ట్ సెన్సార్లు దోమల జాతులు,వాటి లింగం, సాంద్రత, ఉష్ణోగ్రత, తేమను గుర్తిస్తాయి. ఏదైనా నిర్దిష్ట ప్రాంతంలో దోమల సాంద్రత పరిమితి స్థాయిని మించినప్పుడు SMoSS ఆటోమేటిక్ గా హెచ్చరికలను జారీ చేస్తుంది. ఇలా వచ్చిన డేటా నిరంతరం సెంట్రల్ సర్వర్ కు చేరి రియల్ టైమ్ డ్యాష్ బోర్డులో కనిపిస్తుంది.

లార్వాసైడ్ చల్లడానికి డ్రోన్లను వాడటం వలన తక్కువ రసాయనాల వినియోగం, సమయం, వ్యయంతో విస్తృత ప్రాంతాలను కవర్ చేయడం ద్వారా సమర్థవంతంగా ఈ విధానం అమలు చేస్తారు. సాక్ష్యాధార స్ప్రేయింగ్, రసాయనాల అధిక వినియోగం నిరోధం, ప్రజా ఆరోగ్య భద్రతకు ప్రోత్సాహం వీటిలో భాగం. ఆసుపత్రుల నుంచి మలేరియా, డెంగ్యూ , చికన్‌గున్యా వంటి కేసుల గురించి రోజువారీ రిపోర్టింగ్ కోసం కూడా మరో వ్యవస్ధ ఏర్పాటు చేస్తారు. ఈ డేటా ఆధారంగా దోమల హాట్ స్పాట్లు గుర్తించి వాటిని టార్గెట్ చేస్తారు. హాట్‌స్పాట్లలో షెడ్యూల్ చేసిన ఫుమిగేషన్, లార్వా చికిత్స కోసం ప్రత్యేక కార్యాచరణ ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.