Mudra Loan: ముద్రా లోన్‌తో మీ బిజినెస్‌ కల సాకారం.. ష్యూరిటీ లేకుండా రూ.10లక్షల రుణం..

www.mannamweb.com


ఏ దేశానికైనా యువశక్తి చాలా అవసరం. యువతలోని శక్తి సామర్థ్యాలకు సరైన ప్రోత్సాహం తోడైతే వారు వృద్ధి చెందడంతో పాటు దేశ సమగ్రాభివృద్ధికి దోహద పడతారు.
నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధికి తగిన శిక్షణ అందించగలిగితే యువకులు అద్భుతాలు సృష్టిస్తారు. ప్రతి ప్రభుత్వానికి ఈ విషయంలో స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే వారిని ప్రోత్సహించేందుకు పలు ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెడుతుంటాయి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం యువశక్తిని ప్రోత్సహించడంతో పాటు యువ సాధికారత, స్వావలంబన లక్ష్యంగా ఓ ప్రత్యేకమైన పథకాన్ని అమలు చేస్తోంది. దాని పేరు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై). ఇది యువత-కేంద్రీకృత పథకం. ఇది చిన్న తరహా వ్యాపారాలను స్థాపించడానికి రూ. 10 లక్షల వరకు రుణాలను అందిస్తుంది. ఎటువంటి ష్యూరిటీ లేకుండా దీనిని అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ముద్రాలోన్‌ ఎలా పొందాలి? అర్హతేమిటి? ఎంత మొత్తం లోన్‌గా ఇస్తారు? అవసరమైన పత్రాలు ఏంటి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పీఎంఎంవై ప్రధాన ఉద్దేశం..

కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన పథకం యువతను వ్యాపారవేత్తలుగా మలిచేందుకు తోడ్పడుతోంది. అందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేలా చేస్తోంది. నిరుద్యోగులు, సొంతంగా వ్యాపారం చేయాలనుకునే యువతకు అండగా ఉంటుంది. ఎవరైనా మంచి వ్యాపార ఆలోచన ఉండి.. దానిని ప్రారంభించేందుకు అవసరమైన నగదు లేకపోతే అటువంటి వారికి ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పథకం కింద కార్పొరేట్, వ్యవసాయేతర ప్రయోజనాల కోసం రుణాలు అందిస్తారు. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.10 లక్షల వరకు రుణం మంజూరు చేస్తుంది.

సెక్యూరిటీ లేకుండా..

సాధారణంగా మీరు హోమ్ లోన్, గోల్డ్ లోన్ లేదా ఆటో లోన్ మొదలైనవి తీసుకున్నప్పుడు, మీరు మీ ఆస్తిలో దేనినైనా సెక్యూరిటీగా బ్యాంకులో తనఖా పెట్టాలి, కానీ పీఎం ముద్రా లోన్ స్కీమ్ కొలేటరల్ ఫ్రీ. అంటే, ఈ పథకం ద్వారా, మీరు ఏదీ సెక్యూరిటీగా ఉంచాల్సిన అవసరం లేదు.

మూడు కేటగిరీలుగా..

ఈ ముద్రాలోన్ల కోసం మీరు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు, చిన్న ఫైనాన్స్ బ్యాంక్, నాన్-ఫైనాన్షియల్ కంపెనీ వంటి ఏదైనా ప్రభుత్వ/ప్రైవేట్ బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎంత మొత్తం రుణం ఇవ్వాలనే దాని కోసం ఈ లోన్లను మూడు విభాగాలుగా విభజించారు.

శిశు రుణం: ఈ రకమైన రుణంలో, రూ. 50,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.
కిషోర్ లోన్: ఈ పథకం కింద రూ. 5 లక్షల వరకు రుణం అందిస్తారు.
తరుణ్ లోన్: ఇందులో రూ. 10 లక్షల వరకు రుణం పొందొచ్చు.
ముద్రా లోన్‌ కి అర్హత..

సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే ఎవరైనా ఈ పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇప్పటికే మీరు వ్యాపారస్తులైతే దానిని మరింత విస్తరించడానికి కూడా రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కొన్ని షరతులకు లోబడి వాటి మంజూరు ఉంటుంది.

రుణం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి.
దరఖాస్తు చేసే వ్యక్తికి బ్యాంక్ డిఫాల్ట్ చరిత్ర ఉండకూడదు.
ముద్రా లోన్ తీసుకోవాల్సిన ఏ వ్యాపారం అయినా కార్పొరేట్ సంస్థ కాకూడదు.
రుణం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి.
రుణం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి.
ముద్రా లోన్‌ ప్రయోజనాలు ఇవి..

ప్రధాన మంత్రి ముద్రా యోజన ద్వారా, మీరు మీ అవసరాన్ని బట్టి రూ. 50,000 నుండి రూ. 10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాసెసింగ్‌ ఫీజు ఉండదు. రుణం మొత్తం తిరిగి చెల్లించే వ్యవధి 12 నెలల నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఒకవేళ 5 సంవత్సరాలలో తిరిగి చెల్లించలేకపోతే, మీ కాల వ్యవధిని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. మంజూరైన మొత్తం రుణంపై మీరు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ముద్రా కార్డ్ ద్వారా విత్‌డ్రా చేసి ఖర్చు చేసిన మొత్తానికి మాత్రమే వడ్డీ విధిస్తారు.

ముద్రా లోన్‌ కి దరఖాస్తు ఇలా..

ముద్రా యోజన అధికారిక వెబ్‌సైట్‌(mudra.org.in)కి వెళ్లండి.
శిశు, కిషోర్, తరుణ్ అనే మూడు రకాల రుణాలను చూపుతూ హోమ్ పేజీ ఓపెన్‌ అవుతుంది. దానిలో మీ అవసరాన్ని బట్టి ఎంచుకోండి.
ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, దాని ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఫారమ్‌తో పాటు, మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, శాశ్వత, వ్యాపార చిరునామా రుజువు, ఆదాయపు పన్ను రిటర్న్, స్వీయ పన్ను రిటర్న్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మొదలైన కొన్ని పత్రాల ఫోటోకాపీలను జతచేయాలి.
ఈ దరఖాస్తు ఫారమ్‌ను మీ సమీపంలోని బ్యాంక్‌లో సమర్పించండి. అన్నీ సరిగ్గా ఉంటే బ్యాంక్ మీ దరఖాస్తును ధ్రువీకరిస్తుంది. ఒక నెలలోపు రుణం మంజూరు చేస్తారు.