Mudragada Padmanabham: మా కులంలోకి రావొద్దు.. పరువు తీయొద్దు..!
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ముద్రగడ పద్మనాభం పేరు మార్పు వ్యవహారాన్ని కొందరు రెడ్డీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకట రామారెడ్డి దీనిపై ఓ లేఖ విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది.. లేఖ విడుదల చేయడంతో పాటు.. ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో వదిలారు కర్రి వెంకట రామారెడ్డి… “ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముద్రగడ బలపర్చిన పార్టీ ఘోర పరాజయం పొందినందుకు రెడ్డి కులంలో కలవాలని గెజిట్ పబ్లికేషన్ కొరకు అన్నీ సిద్ధం చేసుకున్నట్టు ఓ ప్రకటన నాలుగు రోజుల క్రితం వెలవడింది.. అయితే, వారిని నేను కొన్ని వివరాలు కోరుతున్నాను.. అయ్యా పద్మాభం మీరు రెడ్డి కులంలో చేరటానికి మా రెడ్లు ఎవరైనా అనుమతి ఇచ్చారా? మా రెడ్డి కులంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు..? మా రెడ్ల పరువు తీయడానికి మీరు చేరాలనుకుంటున్నారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మరోవైపు ఆంధ్రా రెడ్డి సంఘం సభ్యలకు కూడా ఓ విజ్ఞప్తి చేశారు వెంకట రామారెడ్డి.. ముద్రగడ పద్మనాభం రెడ్లలో చేరాలని ప్రకటించి నాలుగు రోజులు అయినా మీరు ఎందుకు మాట్లాడటం లేదు ? అని నిలదీశారు. గౌరవంగా బ్రతికే రెడ్లు.. నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలనుకుంటే.. వారిని చేర్చుకోవాల్సిన అవసరం మనకు ఏంటి? అని మండిపడ్డారు. ఇటువంటి వ్యక్తులను మన రెడ్లకు దూరంగా ఉంచవలసిన అవసరం సంఘం సభ్యులుగా మీకు ఉంది.. ఇప్పటికైనా సంఘం సభ్యులు ఒక ప్రకటన ద్వారా ఇటువంటి వ్యక్తులను మా రెడ్లలో చేర్చుకోవటం లేదని ప్రకటించాలని కోరారు.. ఏదైమైనా ముద్రగడ పద్మానభం రెడ్లలో చేరటాన్ని ఒక గ్రామ మాజీ సర్పించ్‌గా, రెడ్డిగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు కర్రి వెంకట రామారెడ్డి..
కాగా, సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తాను చేసిన సవాల్‌కు కట్టుబడి ఉంటానని స్పష్టం చేసిన విషయం విదితమే.. నా పేరును పద్మనాభరెడ్డి గా మార్చాలని గెజిట్‌కు దరఖాస్తు చేసుకుంటానని వెల్లడించారు. అయితే, ఎన్నికల సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. పిఠాపురంలో ఎలా గెలుస్తాడో తాను చూస్తానని సవాల్ చేసిన పద్మనాభం.. ఒకవేళ పవన్ గనుక పిఠాపురంలో గెలిస్తే.. తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన సవాల్ చేసిన విషయం విదితమే.