Mudragada Padmanabham: రాజకీయ నాయకుడి కంటే కాపు ఉద్యమ నేతగానే ముద్రగడ పద్మనాభంకు గుర్తింపు ఉంది. తనకు ఈ రాజకీయాలు అవసరం లేదంటూ అస్త్ర సన్యాసం చేసిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపారు. పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. ఉద్యమ ఫలాలు దక్కకుండానే పోరాటాన్ని ఆపేశారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం జనసేన వైపు చూశారు. అక్కడ వర్కౌట్ కాకపోవడంతో వైసీపీలోకి వెళ్లారు. కాపులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వైసిపి స్టార్ క్యాంపైనర్ అవుతారని భావించారు. కానీ ఆయన పవన్ కోసమే వైసీపీకి వెళ్లినట్లు వ్యవహరిస్తున్నారు. నిత్యం పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కాలం గడిపేస్తున్నారు.
ప్రస్తుతం కిర్లంపూడి లోని తన ఇంటి గేటును కూడా ముద్రగడ దాటడం లేదు. తనను కలిసేందుకు వైసిపి నేతలు, కాపు నాయకులు వచ్చినప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సినిమాల్లో నువ్వు గొప్ప, రాజకీయాల్లో నేను గొప్ప అంటూ ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఎంతటి ముద్రగడ.. ఇలా అయ్యారేంటి అని సన్నిహితులు కూడా వ్యాఖ్యానించే స్థితికి చేరుకున్నారు. అటు వైసీపీ నేతలు కూడా ఆయనకు ఏ పని అప్పగించ లేదని తెలుస్తోంది. కేవలం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడానికే ముద్రగడను వైసీపీలో చేర్చుకున్నట్లు టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఒకరిద్దరు కాపు నేతలను ముద్రగడ ఆకర్షించగలిగారు. కానీ ఎందుకో తర్వాత పిఠాపురం వదిలేశారు. ఇంటికే పరిమితం అయ్యారు.
తనకు తాను ముద్రగడ స్టార్ క్యాంపైనర్ గా భావిస్తున్నారు. అయితే కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తేనే ముద్రగడకు ఎంతోకొంత గుర్తింపు లభించే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం ఆయన ఫేడ్ అవుట్ అయినట్టే. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఆయన రాష్ట్రవ్యాప్తంగా కాపులు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటించాలి. కానీ ఆయన ఆ పని చేయడం లేదు. కేవలం పవన్ కోసమే జగన్ తనను నియమించినట్లు వ్యవహరిస్తున్నారు. తనకున్న పెద్దమనిషి హోదాను కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే ముద్రగడ తీరును చూసి కాపు సామాజిక వర్గంలో కూడా ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం పెద్ద రచ్చ నడుస్తోంది. ఇటువంటి వ్యక్తా కాపు ఉద్యమ నేత అంటూ.. కాపు యువత విమర్శల జడివాన కురిపిస్తోంది.