జగన్‌కు ఇచ్చిన `మాట`ను నెరవేర్చిన ముఖేష్ అంబానీ

www.mannamweb.com


Reliance: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. గతంలో విశాఖపట్నంలో మూడు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న పరస్పర అవగాహన ఒప్పందాల మేరకు ఈ పెట్టుబడులను ప్రకటించింది.
దీనితో పాటు- కుమార మంగళం బిర్లాకు చెందిర ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు కూడా ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ రెండింటితో పాటు వివిధ సంస్థలకు చెందిన పరిశ్రమలు, ఇతర యూనిట్ల నిర్మాణానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. కొద్దిసేపటి కిందటే శంకుస్థాపన చేశారు.

 

వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుడివాడ అమర్‌నాథ్. ఆయా కంపెనీల పెట్టుబడుల విలువ మొత్తం 4,883 కోట్ల రూపాయలు. ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థాయిలో వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రావడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన విజయమని గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.

పలు జిల్లాల్లో బయో ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పడానికి రంగం సిద్దం చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. వాటి విలువ 1,024 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్ధాల నుంచి బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. తొలిదశలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో బయో గ్యాస్‌ ప్లాంట్లను నెలకొల్పనుంది. వీటి వల్ల 576 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
1,700 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆదిత్య బిర్లా గ్రూప్‌.. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ కార్బన్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వీటితోపాటు హెల్లా ఇన్‌ఫ్రా, వెసువియస్‌ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్, అన ఒలియో ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన పలు ప్రాజెక్టులను అమర్‌నాథ్ వర్చువల్‌గా ప్రారంభించారు.